Share News

నిజాంసాగర్‌ నిండాపూడిక

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:18 AM

పూడిక పేరుకుపోవడంతో కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పడిపోయింది.

నిజాంసాగర్‌ నిండాపూడిక

  • తగ్గిపోతున్న ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం

  • 29 నుంచి 17 టీఎంసీలకు పతనం

  • హామీకే పరిమితమైన పూడికతీత

కామారెడ్డి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): పూడిక పేరుకుపోవడంతో కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పడిపోయింది. ఏళ్ల తరబడి పూడికతీత గురించి చర్చ నడుస్తోందే తప్ప చర్యలు లేవు. చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటి భారీ నీటి ప్రాజెక్టుగా పేరున్న నిజాంసాగర్‌ను 1923-31 మధ్య కాలంలో నిజాం పాలకులు నిర్మించారు. 2.50 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు, బోధన్‌, నిజామాబాద్‌, బాన్సువాడ పట్టణాలకు తాగునీరు అందించేలా అప్పట్లో 1,400 అడుగులు, 29.5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును కట్టారు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో మంజీరా పరీవాహక ప్రాంతం లో వర్షాలకు వరదలతో పాటు మట్టి, ఇసుక కొట్టుకురావడంతో ప్రాజెక్టులో పూడిక చేరింది. 1975లో ఇంజనీరింగ్‌ అధికారులు జరిపిన పరిశీలనలో పూడికతో నిజాంసాగర్‌ నీటి నిల్వ సామర్థ్యం 11.89 టీఎంసీలకు తగ్గిపోయినట్లు నిర్ధారించారు. దాంతో 1978లో ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్థాయిని 1,405 అడుగులకు పెంచారు. ప్రస్తుతం 17.8 టీఎంసీల సామర్థ్యానికి చేరింది. ప్రతీ వానాకాలంలో ప్రాజెక్టులోకి వచ్చిన వరదను (30 టీఎంసీలు) వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. అదే పూడిక తీస్తే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. నిజాంసాగర్‌ కింద అప్పట్లో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందేది. పూడిక నిండిపోయి ప్రస్తుతం లక్షా 20 వేల ఎకరాలకే నీరు పారుతోంది. ఎగువన వర్షాలు కురవని పరిస్థితుల్లో ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకమవుతోంది. పూడిక తొలగించి సామర్థ్యం పెంచాలని ఆయకట్టు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 15 , 2026 | 04:18 AM