Share News

కాంగ్రెస్‌ అంటేనే మోసం

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:12 AM

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే మోసమని, ఆ పార్టీ డీఎన్‌ఏలోనే మోసం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ విమర్శించారు. కాంగ్రెస్‌కు తన నాయకులు, కార్యకర్తలపై కూడా అభిమానం ఉండదని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ అంటేనే మోసం

  • హామీలు అమలు చేసిన చరిత్ర ఆ పార్టీకి లేదు.. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?

  • ఆ పార్టీకి ఎంతో సేవచేసిన పీవీని మరణించాక కూడా అవమానించింది

  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే మోసమని, ఆ పార్టీ డీఎన్‌ఏలోనే మోసం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ విమర్శించారు. కాంగ్రెస్‌కు తన నాయకులు, కార్యకర్తలపై కూడా అభిమానం ఉండదని ధ్వజమెత్తారు. పార్టీ కోసం ఆవిశ్రాంతంగా పనిచేసి, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన అపర మేధావి పీవీ నరసింహారావు మరణిస్తే.. ఆయన పార్థివ దేహాన్ని కూడా ఢిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఉంచేందుకు అంగీకరించలేదని మండిపడ్డారు. ఆయన అంత్యక్రియల్లోనూ అవమానకరంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. పీవీని కాంగ్రెస్‌ పార్టీ అవమానిస్తే.. బీజేపీ భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించిందని తెలిపారు. హామీలు ఇవ్వడం, మర్చిపోవడం కాంగ్రెస్‌ నైజమని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న నితిన్‌ నబిన్‌.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు, సభల్లో పాల్గొన్నారు. ఉదయం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఘట్‌కేసర్‌లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్‌ కాలేజీ (వీబీఐటీ)లో నిర్వహించిన ‘వికసిత్‌ భారత్‌ స్టూడెంట్స్‌ కాన్‌క్లేవ్‌’లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు.ఆ తర్వాత హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీజేపీ బూత్‌ అధ్యక్షుల సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాహుల్‌గాంధీ పార్ట్‌టైమ్‌ లీడర్‌ అని, ఆయనకు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారితో మమేకవుతుంటారని తెలిపారు. కరోనా సమయంలో 80 కోట్ల మందిని రక్షించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని కొనియాడారు. మోదీ పాలనలో దేశం ఆర్థిక ంగా, సాంస్కృతికంగా సమతుల్యత సాధించిందని తెలిపారు.


తెలంగాణను దోచుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌

తెలంగాణ ప్రజలకు బీజేపీపై ఎంతో మమకారం ఉందని నితిన్‌ నబిన్‌ అన్నారు. తెలంగాణపై బీజేపీకి ఎల్లప్పుడూ అభిమానమేనని తెలిపారు. దివంగత బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని చెప్పారు. కానీ, బీఆర్‌ఎస్‌ పార్టీలోని ఒక కుటుంబం తెలంగాణ సంపదను దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీకి మూటలు మోస్తున్నారని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావడం ఖాయమని అన్నారు. అంతకుముందు ఆయన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్‌లో గిరిజన నాయకులు, మేధావులతో సమావేశమయ్యారు. మావోయిస్టుల వల్ల ఇంతకాలం గిరిజనుల అభివృద్ధి ఆగిపోయిందని, ఇకపై గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. సుబేదారి సభ అనంతరం నితిన్‌ నబిన్‌.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. వీబీఐటీ కాలేజీలో ‘స్టూడెంట్స్‌ కాన్‌క్లేవ్‌’లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా మోసం చేస్తోందని విమర్శించారు. స్వార్థపరులు జెన్‌జీ ఉద్యమాలు చేసి అనేక దేశాల్లో అస్థిరతను సృష్టిస్తున్నారని, భారత్‌లో యువత వారి మాయలో పడకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

తాటాకు చప్పుళ్లకు భయపడం:కిషన్‌రెడ్డి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ బురదచల్లే ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టంచేశారు. దేశ ప్రజలంతా తమకు గ్యారంటీ మోదీయే అని భావిస్తున్నారని తెలిపారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ.. హామీలపై కాంగ్రెస్‌ నేతల గల్లా పట్టి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నబిన్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్న ఎన్‌ఎస్‌యూఐ

నితిన్‌ నబిన్‌ వరంగల్‌ పర్యటనలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిరిజన ప్రతినిధులతో సమావేశం అనంతరం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో సమావేశానికి వెళ్తుండగా అదాలత్‌ సమీపంలో ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. సుబేదారి పోలీసులు, వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

2.jpg

Updated Date - Jun 30 , 2026 | 05:12 AM