నిఠారీ హత్య కేసుల నిందితుడు.. సురేంద్ర కోలీ అనుమానాస్పద మృతి!
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:02 AM
సంచలనాత్మకమైన 2006 నిఠారీ పిల్లల హత్య కేసుల్లో నిందితుడు సురేంద్ర కోలీ హరిద్వార్‌లోని తన టీ షాపులో శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. హరిద్వార్‌లోని సప్త్ సరోవర్ రోడ్డులోని టీ షాపులో ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని సప్తర్షి పోలీసు అవుట్ పోస్టుకు సమాచారం వచ్చిందని హరిద్వార్ కొత్వాలి పోలీసుస్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ విక్రమ్ బిస్త్ విలేకరులకు చెప్పారు.
హరిద్వార్‌లోని టీ షాపులో ఉరి
వేసుకుని ఉండగా గుర్తించిన పోలీసులు
హరిద్వార్(ఉత్తరాఖండ్), సెప్టెంబరు 18 : సంచలనాత్మకమైన 2006 నిఠారీ పిల్లల హత్య కేసుల్లో నిందితుడు సురేంద్ర కోలీ హరిద్వార్‌లోని తన టీ షాపులో శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. హరిద్వార్‌లోని సప్త్ సరోవర్ రోడ్డులోని టీ షాపులో ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని సప్తర్షి పోలీసు అవుట్ పోస్టుకు సమాచారం వచ్చిందని హరిద్వార్ కొత్వాలి పోలీసుస్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ విక్రమ్ బిస్త్ విలేకరులకు చెప్పారు. చనిపోయిన వ్యక్తి వివరాలు సేకరించగా అతడు సురేంద్ర కోలీగా తేలిందన్నారు. అల్మోరాలోని మాంగృఖల్‌లో కొంతకాలంగా నివసిస్తోన్న అతడు అద్దెకు షాపు తీసుకుని టీ స్టాల్ నడుపుతున్నాడని పోలీసులు చెప్పారు. సురేంద్ర ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో వ్యాపారి మనీందర్‌సింగ్ పంధేర్ ఇంట్లో 2006లో పని మనిషిగా ఉండగా ఆ ఇంటి వెనుక మురుగు కాల్వలో హత్యకు గురైన పలువురి అస్థిపంజరాలను గుర్తించారు. పలువురు చిన్నారులు, కొందరు మహిళల్ని హత్య చేసి అక్కడ పడవేసినట్లు గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘోరంపై విచారణ చేపట్టిన సీబీఐ 19 కేసులు నమోదు చేసి సురేంద్ర కోలీని, వ్యాపారి పంధేర్‌ని అరెస్టు చేసింది. పంధేర్ కొన్నేళ్లపాటు జైల్లో ఉండి 2023 అక్టోబరు 20న నిర్దోషిగా విడుదల అయ్యాడు.
ఈ హత్య కేసుల్లో దోషిగా పేర్కొన్న ఏకైక వ్యక్తి సురేంద్ర కోలీని 2023లోనే అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ, మృతుల తరఫు బంధువులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటన్నిటిని సుప్రీంకోర్టు గత ఏడాది కొట్టివేసింది. సురేంద్ర కోలీపై నమోదైన చివరి కేసు.. 15 ఏళ్ల బాలిక రేప్, హత్య కేసును కొట్టేయాలని అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు బాధిత కుటుంబాల వేదన తీరనిదని పేర్కొంది. అయితే చట్ట ప్రకారం ఆధారాల్లేకుండా, ఊహలపై ఆధారపడి నేర నిర్ధారణ జరగదని స్పష్టం చేసింది. సుదీర్ఘ విచారణ జరిగినా చట్టం ప్రకారం అసలు నేరస్థుడు ఎవరో నిర్ధారించలేకపోవడం అత్యంత విచారకరమని పేర్కొంటూ.. కచ్చితమైన ఆధారాలు లభించనంత వరకు అతడు నిర్దోషేనని భావించాల్సి వస్తుందని తీర్పునిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
నిర్మాణాత్మక విమర్శలు న్యాయ వ్యవస్థకు అవసరం: సీజేఐ
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల