సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మలనే పోటీ చేస్తుంది
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:51 AM
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నా భార్య, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలనే పోటీ చేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నేను పోటీలో ఉండను....
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీలో ఉండను
మరోసారి స్పష్టత ఇచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
వందకు నూటొక్కశాతం తన భార్య బరిలో ఉంటుందని వెల్లడి
0.1 శాతం కూడా తాను పోటీ చేసే అవకాశం లేదని ప్రకటన
సంగారెడ్డి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నా భార్య, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలనే పోటీ చేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నేను పోటీలో ఉండను’’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరో సారి స్పష్టత ఇచ్చారు. సంగారెడ్డిలోని ఓ హోటల్‌లో మంగళవారం సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, బూత్ లెవల్ ఏజంట్లకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారిని ఉద్దేశించి జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా సార్లు చెప్పానని, వందకు నూటొక్కశాతం సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నిర్మలనే బరిలో ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు లేచి పునరాలోచించాలని కోరగా... 0.1 శాతం కూడా తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని.. ఇదే తుది నిర్ణయమని ప్రకటించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా నిర్మల తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు నిరంతరం అందుబాటులో ఉంటోందని, అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోందని వివరించారు.