నిమ్స్‌లో క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రం
ABN , Publish Date - May 31 , 2026 | 05:09 AM
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని ప్రారంభించింది.
అత్యాధునిక సేవలు అందుబాటులోకి
క్యాన్సర్ ఉత్పరివర్తనలను గుర్తించి చికిత్స
ప్రస్తుతం ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ కేసులు.. మున్ముందు అన్ని రకాలకూ..
హైదరాబాద్ సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రోగిలో ఉన్న క్యాన్సర్ మ్యుటేషన్లను (ఉత్పరివర్తనలను) గుర్తించి, రోగులకు లక్ష్యిత వ్యక్తిగత చికిత్సను అందించడానికి అస్కారం ఉంటుందని నిమ్స్ పాథాలజీ విభాగాధిపతి, ఈ ప్రాజెక్ట్ నిపుణుడు డాక్టర్ శాంతవీర్ జి. ఉప్పిన్ వివరించారు. నెల రోజులుగా 48 మంది రోగులపై ప్రయోగత్మకంగా పరీక్షలు జరిపామని, సత్ఫలితాలు రావడంతో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. క్యాన్సర్ నిర్ధారణే కాదు, చికిత్స పూర్తయిన తర్వాత క్యాన్సర్ కణాలు పూర్తిగా నశించాయా? లేదా? అన్నదానిని కూడా ఈ జీనోమిక్స్ కేంద్రం ద్వారా పరిశీలించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని, మున్ముందు అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించి చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. సాధారణ రక్తపరీక్ష ద్వారా క్యాన్సర్‌ను గుర్తించడానికి ఉపయోగపడే లిక్విడ్ బయాప్సీ పరీక్షను కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు డాక్టర్ శాంతవీర్ తెలిపారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ బీరప్ప మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 25 కేంద్రాలను ఎంపిక చేయగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి ఎంపికైన ఏకైక కేంద్రం నిమ్స్ అని పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ (డీహెచ్‌ఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్త ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వ పథకం ‘డైమండ్ ఎస్’ కింద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ పరీక్షలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ‘డైమండ్ ఎస్’ను ప్రారంభించారు.
క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రంలో అందించే పరీక్షలు:
పాలిమరేజ్ చెయిన్ రియాక్షన్ (పీసీఆర్), డిజిటల్ డ్రాప్లెట్ (పీసీఆర్ డీడీపీసీఆర్), ఫ్లోరోసెన్స్ ఇన్ సిటు హైబ్రిడైజేషన్ (ఫిష్), ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ (ఐహెచ్‌సీ), నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్), ఇతర మాలిక్యులర్ డయాగ్నస్టిక్ పరీక్షలు.