Share News

నిమ్స్‌లో మహిళకు అరుదైన సర్జరీ

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:18 AM

మెదడుకు ఓపెన్‌ సర్జరీ చేయకుండా కంటి సాకెట్‌ మార్గం ద్వారా పుర్రె అడుగు ప్రాంతంలో మెదడు కణితిని నిమ్స్‌ వైద్యులు చాకచక్యంగా తొలగించారు.

నిమ్స్‌లో మహిళకు అరుదైన సర్జరీ

  • కన్ను సాకెట్‌ మార్గం ద్వారా మెదడు కణతి తొలగింపు

  • మెదడుకు ఓపెన్‌ సర్జరీ లేకుండానే చిన్న కోతతో పూర్తి

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): మెదడుకు ఓపెన్‌ సర్జరీ చేయకుండా కంటి సాకెట్‌ మార్గం ద్వారా పుర్రె అడుగు ప్రాంతంలో మెదడు కణితిని నిమ్స్‌ వైద్యులు చాకచక్యంగా తొలగించారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు అత్యాధునిక ఎండోస్కోపిక్‌ ట్రాన్స్‌ఆర్బిటల్‌ అప్రోచ్‌ పద్ధతిలో మెదడు కణితిని విజయవంతంగా తొలగించారు. ఐ సాకెట్‌(కంటి గవ్వ) సహజ మార్గాన్ని ఉపయోగించి పెద్ద గాయం లేకుండా కణితిని తొలగించడం ఈ చికిత్స ప్రత్యేకత. మెదక్‌ జిల్లా చిన్నశంకరపేట మండలం మధుర్‌ గ్రామానికి చెందిన ఎం.లత(50) తీవ్రమైన తలనొప్పితో నిమ్స్‌ను వైద్యులను సంప్రందించారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కంటి వెనుక భాగంలోని పుర్రె అడుగు ప్రాంతంలో మెదడు కణితి ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. కనుబొమ్మ సహజ మడత వద్ద చిన్న కోత చేసి, హై-డెఫినిషన్‌ ఎండోస్కోప్‌ సహాయంతో కణితిని తొలగించారు. ఈ ప్రక్రియలో బయటకు కనిపించే మచ్చలు ఉండవని, మెదడు కణజాలానికి తక్కువ నష్టం కలుగుతుందన్నారు. రోగి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయినట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప తెలిపారు. ఈ శస్త్రచికిత్సను తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) పథకాల కింద ఉచితంగా నిర్వహించామన్నారు. పైవ్రేట్‌ ఆసుపత్రుల్లో ఇదే చికిత్సకు సుమారు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. సర్జరీ చేసిన న్యూరోసర్జరీ హెచ్‌వోడీ డాక్టర్‌ వై.వంశీకృష్ణ ఇతర వైద్యులు యర్రగుంట తిరుమల్‌, రామ్‌నాథ్‌ రెడ్డి, మురళీకృష్ణ, ఉమా మహేశ్వర్‌, శ్రీలత, స్వప్నలతను నిమ్స్‌ డైరెక్టర్‌ అభినందించారు.

Updated Date - Jun 07 , 2026 | 06:18 AM