నిమ్స్‌కు కొత్త డైరెక్టరా.. కొనసాగింపేనా?
ABN , Publish Date - May 12 , 2026 | 03:50 AM
నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ పదవీ కాలం జూన్ 7తో ముగియనుంది. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ బీరప్పనే కొనసాగిస్తారా..
జూన్ 7తో ముగియనున్న ప్రస్తుత డైరెక్టర్ బీరప్ప పదవీకాలం
కొత్త డైరెక్టర్ నియామకానికినెల ముందే సెర్చ్ కమిటీ వేయాలి
కానీ, ఇంకా ప్రారంభం కాని ప్రక్రియ
బీరప్పనే కొనసాగిస్తారని ఊహాగానాలు.. సీనియర్లలో అసంతృప్తి
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ పదవీ కాలం జూన్ 7తో ముగియనుంది. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ బీరప్పనే కొనసాగిస్తారా.. లేక కొత్తవారికి కాంగ్రెస్ సర్కారు అవకాశం ఇస్తుందా.. అన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. నిబంధనల ప్రకారమైతే కొత్త డైరెక్టర్ నియామకం చేపట్టాలంటే నెల రోజుల ముందుగానే కసరత్తు ప్రారంభించాలి. ముందుగా డైరెక్టర్ నియామకం కోసం సెర్చ్ కమిటీని వేయాలి. ఆ సెర్చ్ కమిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారి జాబితాను సెర్చ్ కమిటీ ఎంపిక చేసి సర్కారుకు పంపిస్తుంది. తర్వాత ప్రభుత్వం వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంది. అయితే, ఇప్పటివరకు సెర్చ్ కమిటీ వేయకపోవడంతో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్‌నే కొనసాగిస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే నాలుగేళ్లుగా డైరెక్టర్‌గా కొనసాగుతున్న బీరప్పను ఇంకా కొనసాగిస్తారేమోనన్న అంశంపై నిమ్స్ ఆస్పత్రిల్లోని సీనియర్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొత్త డైరెక్టర్‌ను నియమించాలని సీనియారిటీ, సర్వీ్‌సను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
నిమ్స్‌లో ఉన్న సీనియర్ల ప్రయత్నాలు
ప్రస్తుత డైరెక్టర్ బీరప్ప పదవీ కాలం వచ్చే నెలలో ముగుస్తుండటంతో ఆ పోస్టు కోసం ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా నిమ్స్‌లో ఉన్న సీనియర్సే ఆ పోస్టు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. రేసులో ప్రస్తుత వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ నరేంద్రకుమార్ పేరు కూడా వినిపిస్తోంది. డీఎంఈగా ఆయన జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. నిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ నిమ్మ సత్యనారాయణ సైతం డైరెక్టర్ పోస్టు కోసం తీవ్రంగా యత్నిస్తున్నట్లు నిమ్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రి దామోదర రాజనర్సింహాతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని, అది ఆయనకు కలిసి వచ్చే అంశమని నిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. నిమ్స్ నెఫ్రాలజీ ఫ్రొఫెసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు కూడా నిమ్స్ డైరెక్టర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. యూరాలజీ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ పేరూ నిమ్స్ డైరెక్టర్ రేసులో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన డాక్టర్ రాహుల్ వందల సంఖ్యలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అపరేషన్లు చేశారు.