Share News

నైట్‌ డ్యూటీలతో ఆరోగ్యానికి ముప్పు

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:59 AM

మీది రాత్రి పూట ఉద్యోగమా? పగలు నిద్రించి.. సాయంత్రం కాగానే ఆఫీసుకు బయల్దేరతారా? రాత్రంతా ఆఫీసులోనే ఉంటారా? సంవత్సరాల తరబడి మీ జీవన విధానం ఇలాగే కొనసాగుతోందా....

నైట్‌ డ్యూటీలతో ఆరోగ్యానికి ముప్పు

  • పగలు కంటే.. రాత్రి షిఫ్టులవారికే అనారోగ్య సమస్యలు

  • మధుమేహం, హృద్రోగాల వంటివాటి బారిన పడే ముప్పు ఎక్కువ

  • డి-విటమిన్‌ లోపం.. నిద్రలేమితో విడుదల కాని గ్రోత్‌హార్మోన్‌

  • ఇన్సులిన్‌ నిరోధకత, హార్మోన్ల అసమతౌల్యమే ప్రధాన కారణాలు

  • గాంధీ వైద్య కళాశాల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మీది రాత్రి పూట ఉద్యోగమా? పగలు నిద్రించి.. సాయంత్రం కాగానే ఆఫీసుకు బయల్దేరతారా? రాత్రంతా ఆఫీసులోనే ఉంటారా? సంవత్సరాల తరబడి మీ జీవన విధానం ఇలాగే కొనసాగుతోందా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. ఏళ్ల తరబడి రాత్రి ఉద్యోగాలకు అంకితమైనవారికి.. పగటిపూట పనిచేసేవారితో పోలిస్తే అనారోగ్య సమస్యల ముప్పు ఎక్కువని హైదరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. వారి అధ్యయన నివేదిక.. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా వారు ఒక బహుళజాతి కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఆ సంస్థలో పగటిపూట విధులు నిర్వర్తించేవారితో పోలిస్తే.. నైట్‌ షిఫ్టులు చేసేవారిలో ఇన్సులిన్‌ నిరోధకత ఎక్కువగా ఉండటమే కాకుండా, టెస్టోస్టెరాన్‌ స్థాయులు పడిపోవడం, అధిక కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు పెరుగుతున్నాయని తేలింది.

బరువు తక్కువ ఉన్నా..

సాధారణంగా అధిక బరువు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని అంతా అనుకుంటారు. కానీ, ఈ అధ్యయనంలో అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. రాత్రి షిఫ్ట్‌ చేసేవారి సగటు వయస్సు (28.6 ఏళ్లు), బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ - 24.2).. పగలు పని చేసేవారి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, వారిలోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే.. నైట్‌ డ్యూటీలు చేసే వారిలో 77 శాతం మందిలో ఇన్సులిన్‌ నిరోధకత కనిపించింది. ఇది భవిష్యత్తులో టైప్‌-2 డయాబెటిస్ కు దారితీస్తుంది. పగలు పనిచేేస వారిలో ఇది 62 శాతంగానే ఉంది. ఇక.. రాత్రిపూట విధులు నిర్వహించేవారిలో శరీరంలో ట్రైగ్లిజరైడ్స్‌ స్థాయులు సగటున 195 ఎంజీ/డీఎల్‌ (మిల్లీగ్రామ్‌ ఫర్‌ డెసిలీటర్‌) ఉండగా, డే షిఫ్ట్‌ వారిలో 180 ఎంజీ/డీఎల్‌గా నమోదయ్యాయి. అలాగే శరీరంలో ఉండాల్సిన మంచి కొలెస్ట్రాల్‌ సైతం నైట్‌ డ్యూటీల వారిలో గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. మంచి కొలెస్ట్రాల్‌ సాధారణ స్థాయి 45-60 ఎంజీ/డీఎల్‌ కాగా.. వారిలో కేవలం 35 ఎంజీ/డీఎల్‌ గా ఉంది. 35 అంతకంటే తక్కువగా ఉంటే హైరిస్క్‌లో ఉన్నట్లు, ఇది హృద్రోగాల బారిన పడే ముప్పును పెంచుతుంది.


హార్మోన్ల అల్లకల్లోలం..

రాత్రుళ్లు సరిగా నిద్రపోకపోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతోందని అధ్యయన నివేదిక పేర్కొంది. ప్రధానంగా.. రాత్రి డ్యూటీలు చేసే మగవారిలో టెస్టోస్టెరాన్‌ స్థాయులు 400 ఎన్‌జీ/డీఎల్‌ నుండి 373.6 ఎన్‌జీ/డీఎల్‌కి తగ్గాయి. దీనివల్ల అంగస్తంభన వంటి లైంగిక సమస్యలు తలెత్తుతాయి. ఇక, రాత్రిపూట ఉద్యోగాలు చేసే స్త్రీలలో ఈస్ర్టాడయోల్‌ స్థాయులు, థైరాయిడ్‌ సమస్యలు సైతం పెరిగాయి. పగటిపూట పనిజేసేవారితో పొల్చితే నైట్‌ డ్యూటీలు నిర్వహించే వారిలో 22 శాతం మంది ‘సబ్‌క్లినికల్‌ హైపోథైరాయిడిజం’ బారిన పడుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. గ్రోత్‌ హార్మోన్‌ స్థాయులు కూడా తగ్గినట్లు గమనించారు. గ్రోత్‌ హార్మోన్‌ ప్రధానంగా నిద్రలో విడుదల అవుతుంది. రాత్రిపూట నిద్రలేకపోవడంతో అది విడుదల కావడం లేదని అధ్యయనకర్తలు వెల్లడించారు.

సూర్యరశ్మి లేక..

రాత్రిపూట పనిచేసి, పగలు నిద్రపోయేవారికి.. సూర్యరశ్మి తగలడం లేదు. ఫలితంగా విటమిన్‌-డి స్థాయులు వారికి చాలా తక్కువగా ఉంటున్నాయి. పగలు పనిచేసేవారిలో సగటున 13.7 ఎన్‌జీ/ఎంఎల్‌గా ఉన్న డి విటమిన్‌ స్థాయులు.. రాత్రి పనిచేసేవారిలో సగటున 10.4 ఎన్‌జీ/ఎంఎల్‌ మేర ఉన్నాయి. అంటే, పగలు, రాత్రి డ్యూటీలలో పనిజేసేవారిద్దరిలోనూ విటమిన్‌ డీ తక్కువగా ఉన్నట్లే.

ముందస్తు పరీక్షలు తప్పనిసరి

భారతదేశంలో ఐటీ, హెల్త్‌కేర్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో లక్షలాది మంది రాత్రి షిఫ్టులు చేస్తున్నారని.. కానీ వారిలో చాలామందికి ఆరోగ్యంపై సరైన అవగాహన లేదని ఈ అధ్యయనం చేసిన వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బరువు, నడుము చుట్టుకొలతను బట్టి ఒక నిర్ణయానికి రాకుండా.. వైద్యులను సంప్రదించి, వారి సలహా, సూచనల మేరకు ముందస్తు వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆయా కంపెనీలు కూడా తమ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక సూచించింది.

Updated Date - Apr 14 , 2026 | 09:18 AM