నైజీరియా నుంచి డ్రగ్స్ నెట్‌వర్క్
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:06 AM
డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన నైజీరియాకు చెందిన ఓ నేరస్థుడిని అతడి స్వదేశానికి తిప్పి పంపినా.. అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా బెంగళూరు...
సోషల్ మీడియా వేదికగా లావాదేవీలు
‘డెడ్ డ్రాప్’లో రహస్యంగా విక్రయాలు
కర్ణాటక, తెలంగాణల్లో లింకులు
బెంగళూరులో తెలంగాణ ‘ఈగల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్
కీలక నిందితుడి అరెస్ట్
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన నైజీరియాకు చెందిన ఓ నేరస్థుడిని అతడి స్వదేశానికి తిప్పి పంపినా.. అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా బెంగళూరు, హైదరాబాద్‌లలో మాదకద్రవ్యాల దందా కొనసాగిస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. అతడితో సమన్వయం చేసుకుంటూ స్థానికంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యక్తిని రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ‘ఈగల్’ ఫోర్స్ అరెస్టు చేసింది. దీనికోసం బెంగళూరులో ఐదు రోజులపాటు భారీ ఆపరేషన్ నిర్వహించింది. కేసు ప్రాథమిక దర్యాప్తులో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. ఈగల్ ఫోర్స్ చీఫ్ సందీప్ శాండిల్య ఈ కేసు వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లాకు చెందిన రాహుల్ (24) ఈ డ్రగ్స్ వ్యాపారంలో కీలక వ్యక్తి. బీటెక్ పూర్తి చేసిన రాహుల్ బెంగళూరులోని ఓ వాహన షోరూంలో 4 నెలలు పని చేశాడు. ఆ సమయంలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. బెంగళూరులో డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియా దేశస్థుడు మైఖేల్ జాన్సన్ అలియాస్ హానర్‌తో రాహుల్‌కు పరిచయం ఏర్పడింది. మైఖేల్ డ్రగ్స్ దందా గురించి తెలిసి.. మూడు నెలల కిందట బెంగళూరు పోలీసులు అతడిని నైజీరియాకు తిప్పి పంపారు. అయినా, మైఖేల్ పాత పరిచయాలతో సోషల్ మీడియా వేదికగా బెంగళూరు, హైదరాబాద్‌లో డ్రగ్స్ నెట్‌వర్క్ కొనసాగిస్తూ వచ్చాడు. మరోవైపు, డ్రగ్స్‌కు బానిసగా మారిన రాహుల్ ఉద్యోగం ఊడిపోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు. మైఖేల్‌ను ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించాడు. డ్రగ్స్‌ను స్థానికంగా విక్రయించటం ప్రారంభించాడు. వాట్సప్ క్యూఆర్ కోడ్‌తో పేమెంట్లు జరిగాక మైఖేల్ ఏజెంట్లు డ్రగ్స్‌ను ఏదైనా నిర్మానుష ప్రదేశంలో దాచి పెట్టి ఆ లొకేషన్‌ను రాహుల్‌కు షేర్ చేసేవారు. డ్రగ్స్ దందాలో ఈ పద్ధతిని డెడ్ డ్రాప్ అని పిలుస్తున్నారు.
ఆ లొకేషన్ల నుంచి డ్రగ్స్ తీసుకొని రాహుల్ కూడా డెడ్ డ్రాప్ పద్ధతిలోనే వినియోగదారులకు విక్రయించేవాడు. దీంట్లో భారీగా డబ్బు వస్తుండటంతో రాహుల్ విలాసవంతమైన జీవితం కొనసాగించాడు. కాగా, గతంలో రాహుల్ జైలుకు వెళ్లినప్పుడు అక్కడ పరిచయమైన మోహిత్ కుమార్ అనే వ్యక్తి కూడా జైలు నుంచి బయటకొచ్చాక ఈ దందాలోకి దిగాడు. ఈ నెల 7న బెంగళూరులో రాహుల్ వద్ద నుంచి 20 గ్రాముల డ్రగ్స్ కొనుగోలు చేశాడు. వాటిని తీసుకొని హైదరాబాద్‌కు వస్తుండగా.. ముందస్తు సమాచారంతో ఈగల్ ఫోర్స్, షాద్‌నగర్ పోలీసులు పట్టుకొని ప్రశ్నించారు. మోహిత్ వెల్లడించిన వివరాల మేరకు ఈగల్ బృందం, బెంగళూరు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు 5 రోజులు నిఘా పెట్టి.. పూర్తి ఆధారాలతో రాహుల్‌ను అరెస్ట్ చేసారు. అతని వద్ద నుంచి 241 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ ఫోన్‌లో షోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించగా.. గతంలో తెలంగాణలో పోలీసులు పలుమా ర్లు పట్టుకున్న డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారుల నెంబర్లు కనిపించాయి. దర్యాప్తు కొనసాగిస్తున్నామని, మాదకద్రవ్యాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నెంబరు 1908కు తెలియజేయాలని సందీప్ శాండిల్య సూచించారు.