వరవరరావు బెయిల్ రద్దు చేయండి
ABN , Publish Date - May 16 , 2026 | 04:27 AM
ఎల్గార్ పరిషద్ కేసులో నిందితులు వరవరరావు, సుధా భరద్వాజ్‌లకు ఇచ్చిన బెయిళ్లను రద్దు చేయాలని ఎన్‌ఐఏ శుక్రవారం ప్రత్యేక కోర్టును కోరింది.
కోర్టుకు ఎన్‌ఐఏ వినతి
ముంబయి, మే 15: ఎల్గార్ పరిషద్ కేసులో నిందితులు వరవరరావు, సుధా భరద్వాజ్‌లకు ఇచ్చిన బెయిళ్లను రద్దు చేయాలని ఎన్‌ఐఏ శుక్రవారం ప్రత్యేక కోర్టును కోరింది. బెయిల్ నిబంధనలను కావాలని ఉల్లంఘించి, మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నందున తిరిగి అరెస్టు చేయాలని తెలిపింది. సుధా భరద్వాజ్‌కు 2021లో, వరవరరావుకు 2022లో కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా ముంబయి విడిచివెళ్లరాదని, పాసుపోర్టులు అప్పగించాలని, ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడరాదని, ఈ తరహా నేరాలను చేయరాదని షరతులు విధించింది. అయితే వీటిని ఉల్లంఘించి జనవరి 19న ముంబయి ప్రెస్‌క్లబ్‌లో ఈ కేసులోని ఇతర నిందితులతో కలిసి సమావేశం నిర్వహించారని తెలిపింది. అర్బన్ నక్సల్ ఉద్యమ వ్యాప్తిపై చర్చలు జరిపారని పేర్కొంది. దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నందున బెయిల్‌కు అర్హులు కారని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 22కు వాయుదా వేసింది.