Share News

NIA Raids: ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో ఎన్‌ఐఏ సోదాలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 07:00 AM

ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు, సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు.

NIA Raids: ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో ఎన్‌ఐఏ సోదాలు

  • లక్ష నగదు, కరపత్రాలు స్వాధీనం

  • ల్యాప్‌టాప్‌, రెండు ట్యాబ్‌లు, పలు పత్రాలను సీజ్‌ చేసిన అధికారులు

  • ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఇన్నయ్య

జఫర్‌గడ్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు, సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలంలోని ప్రజాదరణ ఆశ్రమంతోపాటు ఇన్నయ్య స్వగ్రామమైన సాగరంలోని ఇంట్లో మంగళవారం ఏకకాలంలో తనిఖీలు చేశారు. సుమారు 30 మంది అధికారులు, పోలీసులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఎన్‌ఐఏ అధికారులు గత నెల 21న ఇన్నయ్యను ఉపా చట్టం కింద అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌లోని కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్‌ విఽధించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో రిమాండ్‌ గడువు పూర్తికానున్న నేపథ్యంలో ఇన్నయ్యను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని ఆధారాలు సేకరించేందుకే ఆశ్రమంలో, ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉదయం ఆశ్రమంలోకి ప్రవేశించి, తనిఖీలు ప్రారంభించిన అధికారులు.. గేట్లు మూసివేశారు. పలు పత్రాలతోపాటు ఓ ల్యాప్‌టాప్‌, పని చేయని రెండు ట్యాబ్‌లు, తెలంగాణ రాష్ట్ర సాధన త్యాగధనుల, ఉద్యమకారుల చరిత్ర రచన అనే పుస్తకంతో పాటు ఐటీఆర్‌ ఫైలింగ్‌ పత్రాలు, ఆశ్రమ రశీదు పుస్తకాలు, రోజూవారీ లెక్కల పుస్తకాలను సీజ్‌ చేశారు. ఆశ్రమం నుంచి సాయంత్రం 5.30 గంటలకు ఎన్‌ఐఏ అధికారులు వెనుదిరిగారు. సాగరంలోని ఇన్నయ్య ఇంట్లో తనిఖీలు చేసిన అఽధికారులు.. రూ.లక్ష నగదుతోపాటు సామాజిక ఉద్యమ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పంట భూములు కౌలుకు ఇవ్వగా వచ్చిన డబ్బు అని.. అనారోగ్యంతో ఉన్న అత్తమామలకు వైద్యం, పండగ ఖర్చుల కోసం ఉంచామని చెప్పినా వినలేదని, కోర్టులో డిపాజిట్‌ చేస్తామని.. అక్కడి నుంచి డబ్బును తీసుకెళ్లాలని పోలీసులు చెప్పారని ఇన్నయ్య భార్య పుష్పరాణి తెలిపారు.

Updated Date - Jan 14 , 2026 | 07:00 AM