గాదె ఇన్నయ్య తరహాలో..మరికొందరికి ఎన్‌ఐఏ నోటీసులు
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:19 AM
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా అంత్యక్రియలకు హాజరై, అక్కడ ప్రసంగించిన వారిలో మరికొందరికి ఎన్‌ఐఏ నోటీసులు అందాయి.
ఇంటర్నెట్ డెస్క్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా అంత్యక్రియలకు హాజరై, అక్కడ ప్రసంగించిన వారిలో మరికొందరికి ఎన్‌ఐఏ నోటీసులు అందాయి. సెప్టెంబరులో ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రామచంద్రారెడ్డి చనిపోయారు. ఆయన అంత్యక్రియలు సిద్దిపేట జిల్లా తీగలకుంటపల్లిలో జరిగాయి. ఆ కార్యక్రమానికి వెళ్లిన గాదె ఇన్నయ్యతో పాటు మరికొందరు కేంద్రాన్ని విమర్శించడంతో పాటు ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ క్రమంలో ఎన్‌ఐఏ అధికారులు ఇన్నయ్యపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాజాగా సిద్దిపేట జిల్లా తీగలకుంటపల్లి పరిసర గ్రామాల్లోని కొందరు సర్పంచ్‌లు, రాజకీయ నాయకులు విచారణకు హాజరు కావాలని ఎన్‌ఐఏ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.