Share News

పర్యావరణవేత్తల అరెస్టుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

ABN , Publish Date - May 21 , 2026 | 03:49 AM

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) జాతీయ పార్క్‌ పరిసరాల్లో చెట్ల నరికివేతను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన పర్యావరణవేత్తలను పోలీసులు అరెస్టు చేయడంపై....

పర్యావరణవేత్తల అరెస్టుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

  • తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ కలెక్టర్‌కు నోటీసులు

న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) జాతీయ పార్క్‌ పరిసరాల్లో చెట్ల నరికివేతను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన పర్యావరణవేత్తలను పోలీసులు అరెస్టు చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కమిషన్‌ సుమోటోగా స్వీకరించి.. బుధవారం విచారించింది. వార్తా కథనాల్లోని అంశాలు నిజమైతే అది కచ్చితంగా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. అసలేం జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ జరిపి, రెండు వారాల్లోగా తమకు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నెల 13న కేబీఆర్‌ పార్క్‌ వద్ద చెట్లను నరికేయడాన్ని నిరసిస్తూ కొందరు పర్యావరణవేత్తలు ఆందోళనకు దిగారు. ఈ నిరసనల అనంతరం పోలీసులు మొదట ఒక వలంటీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని గురించి ఆరా తీసేందుకు ఠాణాకు వెళ్లిన మరో నలుగురు కార్యకర్తలను సైతం పోలీసులు నిర్బంధించారు. ఈ నేపథ్యంలోనే వీరిని కొన్ని గంటల పాటు స్టేషన్‌లోనే ఉంచినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అరెస్టయిన ఆ ఐదుగురిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) కింద ఆస్తికి నష్టం కలిగించడం, అక్రమంగా అడ్డుకోవడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి పలు సెక్షన్లతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు.

Updated Date - May 21 , 2026 | 03:49 AM