Share News

‘మూసీ’పై పిటిషన్‌ను కొట్టేసిన ఎన్జీటీ

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:52 AM

మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో ఊరట లభించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ మాజీ ...

‘మూసీ’పై పిటిషన్‌ను కొట్టేసిన ఎన్జీటీ

  • పర్యావరణ అనుమతి లేదని కార్తీక్‌రెడ్డి పిటిషన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో ఊరట లభించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, బీఆర్‌ఎస్‌ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్జీటీ కొట్టివేసింది. మూసీ అభివృద్ధిలో భాగమైన గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పిటిషనర్‌ ఆరోపించారు. అనుమతులు లేకుండా తదుపరి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా అడ్డుకోవాలని.. ఇప్పటికే పనులు చేసినందుకు జరిమానా విధించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌(ఏఏజీ) రజినీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. పర్యావరణ అనుమతి కోసం ఇప్పటికే దరఖాస్తు చేశామని, ఏ పని చేసినా పర్యావరణ ప్రభావం మదింపు కోసం సమర్పించిన టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీవోఆర్‌) ప్రకారమే చేస్తామని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేశారని, ప్రభుత్వం ఇంకా ఎలాంటి పనులు చేపట్టలేదని.. డీపీఆర్‌ రూపకల్పన దశలోనే ప్రాజెక్టు ఉందని పేర్కొన్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తోందని, అందుకే ఎన్జీటీని రాజకీయ వేదికగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. వాదనలు విన్న ఎన్జీటీ ధర్మాసనం.. పిటిషనర్‌ పేర్కొంటున్న అంశాలన్నింటికీ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో సమాధానాలున్నాయని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - Apr 03 , 2026 | 04:52 AM