ఫ్యూచర్ సిటీపై స్టేకు ఎన్జీటీ నిరాకరణ
ABN , Publish Date - Apr 08 , 2026 | 06:17 AM
ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.
చట్టవిరుద్ధంగా ఏదీ చేయబోమని హామీ ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ ప్రాజెక్టుపై ఎలాంటి స్టే ఇవ్వడానికి ఎన్జీటీ నిరాకరించింది. ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసె్‌సమెంట్ (పర్యావరణ ప్రభావ మదింపు) నోటిఫికేషన్ - 2006లో పేర్కొన్న ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండానే దాదాపు 30 వేల ఎకరాల్లో టౌన్‌షి్‌ప ప్రాజెక్టును చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, వీటిపై స్టే ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ కొంపల్లికి చెందిన డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ అనుమతులులేని ఈ చర్యలు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజినీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ఇప్పటివరకు ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించలేదని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా పనులు చేపట్టబోమని, సరైన సమయంలో పర్యావరణం సహా అన్ని అనుమతులు తీసుకుంటామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రాజెక్టు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నందున అనుమతులు తీసుకోరని ఎందుకు అనుకోవాలని ప్రశ్నిస్తూ.. స్టే ఇవ్వడానికి నిరాకరించింది. వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ జూన్ 9కి వాయిదాపడింది.