ప్రాథమిక దశలో ఫ్యూచర్‌సిటీపై జోక్యం చేసుకోలేం
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:04 AM
పర్యావరణ అనుమతి లేకుండానే అభివృద్ధి పనులు చేపడుతారన్న ముందస్తు ఊహతో ‘ఫ్యూచర్ సిటీ’ విషయంలో ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకోలేమని ..
ఎన్జీటీ చెన్నై ధర్మాసనం
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ అనుమతి లేకుండానే అభివృద్ధి పనులు చేపడుతారన్న ముందస్తు ఊహతో ‘ఫ్యూచర్ సిటీ’ విషయంలో ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకోలేమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రణాళికాబద్ధమైన విధానం ద్వారా అభివృద్ధిని చేపట్టాలని ప్రతిపాదిస్తున్నప్పుడు అడ్డుకోవడం సమర్థనీయం కాదని.. అసలు పనులు ఎలా చేపడతారో చూడాలని పేర్కొంది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం చెన్నై మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీని స్థాపించారని.. అలాగే ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీని కూడా అభివృద్ధి చేస్తే సమస్య ఉండదంటూ.. పిటిషనర్ కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ముందస్తు పర్యావరణ అనుమతి పొందకుండానే ఫ్యూచర్‌సిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నారంటూ డాక్టర్ నరసింహారెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాదనలు విన్న ధర్మాసనం.. ప్రాథమిక దశలోనే ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడింది. విచారణను జూలై 14కు వాయిదా వేసింది.