Share News

ఎస్‌ఎల్‌బీసీ మార్గంలో..4 చోట్ల డేంజర్‌ జోన్లు

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:04 AM

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ)లో తవ్వకుండా మిగిలి ఉన్న 9.559 కిలోమీటర్ల మార్గంలో నాలుగు ప్రమాదకర జోన్‌లు ఉన్నాయని జాతీయ భూభౌతిక పరిశోధన కేంద్రం(ఎన్‌జీఆర్‌ఐ) గుర్తించింది.

ఎస్‌ఎల్‌బీసీ మార్గంలో..4 చోట్ల డేంజర్‌ జోన్లు

  • 15, 17, 19, 20 కి.మీ పాయింట్ల వద్ద నేల పొరల్లో బలహీన ప్రాంతాలు

  • నల్లవాగు దిగువన ఎక్కువగా సమస్య

  • సెన్సర్ల డేటా ఆధారంగా తవ్వకాలు

  • ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌పై ఎన్‌జీఆర్‌ఐ నివేదిక

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ)లో తవ్వకుండా మిగిలి ఉన్న 9.559 కిలోమీటర్ల మార్గంలో నాలుగు ప్రమాదకర జోన్‌లు ఉన్నాయని జాతీయ భూభౌతిక పరిశోధన కేంద్రం(ఎన్‌జీఆర్‌ఐ) గుర్తించింది. శ్రీశైలం ఇన్‌లెట్‌వైపు నుంచి 15, 17, 19, 20 కిలోమీటర్‌ పాయింట్ల వద్ద నేల పొరల్లో బలహీన ప్రాంతాలు ఉన్నాయని తేల్చింది. భూఉపరితలంపై ప్రవహిస్తున్న నల్లవాగు నీటి ప్రవాహం కారణంగానే టన్నెల్‌ తవ్వేదారిలో తేమ అధికంగా ఉందని వెల్లడించింది. ఆయా ప్రమాదకర జోన్లలో సెన్సర్ల డేటా ఆధారంగా తవ్వకాలను కొనసాగించాలని స్పష్టం చేసింది.

సొరంగం మధ్యలో ప్రమాదంతో..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పొడవు మొత్తం 43.931 కిలోమీటర్లు కాగా.. రెండు వైపుల నుంచీ తవ్వకాలు చేపట్టారు. ఇన్‌లెట్‌ (శ్రీశైలం వైపు) నుంచి 13.93 కిలోమీటర్ల మేర.. ఔట్‌లెట్‌ (మన్నెవారిపల్లి, అచ్చంపేట) వైపు నుంచి 20.43 కిలోమీటర్ల మేర తవ్వారు. మధ్యలో ఇంకా 9.559 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. 2025 ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంతో తవ్వకం పనులు నిలిచిపోయాయి. అదంతా షీర్‌ జోన్‌ (తేమతో కూడి, వదులుగా ఉన్న మట్టి భాగం) అని.. పూర్తి పరిశీలన జరిపే వరకు తవ్వకాలు చేపట్టవద్దని ఎన్‌జీఆర్‌ఐ అప్పట్లోనే హెచ్చరించింది. దానితో ఇన్‌లెట్‌ వైపు ధ్వంసమైన టీబీఎంలో కొన్ని భాగాలను బయటికి తీశారు. ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉండటంతో మిగిలిన టీబీఎం భాగాలను, మట్టి, రాళ్ల కింద కూరుకుపోయిన ఆరుగురి అవశేషాలను బయటికి తీయడం సాధ్యం కాలేదు. ఈ ప్రాంతంలో సొరంగం తవ్వకానికి టీబీఎం విధానం శ్రేయస్కరం కాదని గుర్తించిన ప్రభుత్వం.. సురక్షితంగా, శాస్త్రీయంగా సొరంగం తవ్వడానికి వీలుగా ఎన్‌జీఆర్‌ఐతో ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ సర్వే చేయించింది.


ప్రతిపాదిత ప్రాంతానికి ఇరువైపులా..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రతిపాదిత ప్రాంతం పొడవునా భూమి పొరలు, రాతి నిర్మాణం, బలహీన ప్రాంతాలు, భౌగోళిక లోపాలు (ఫాల్ట్స్‌), మడతల (ఫోల్డ్స్‌)ను గుర్తించేందుకు ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు విస్తృత స్థాయిలో హెలిబార్న్‌ ఎలాకోట్రామాగ్నెటిక్సర్వే (హెలికాప్టర్‌లో ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేసి.. ప్రతిపాదిత ప్రాంతం పొడవునా ప్రయాణిస్తూ పరిశీలన) నిర్వహించారు. మొత్తంగా 970 లైన్‌ కిలోమీటర్ల మేర సర్వే చేశారు. నిర్మిత/ ప్రతిపాదిత సొరంగ మార్గానికి ఇరువైపులా 1.2 కిలోమీటర్ల వెడల్పున.. మొత్తంగా 110 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశీలన జరిపారు. సొరంగానికి ఇరువైపులా.. ఉపరితలం నుంచి 800 మీటర్లలోతు వరకు భూమి పొరలు, రాతి నిర్మాణాన్ని సమగ్రంగా పరిశీలించారు. తాజాగా ఆ సర్వే నివేదికను ఎన్‌జీఆర్‌ఐ ప్రభుత్వానికి అందజేసింది. సొరంగంలో నీటి ఊటలు (సీపేజీ) తీవ్రంగా ఉన్నాయని.. ముఖ్యంగా నల్లవాగు ప్రవాహం దిగువన ఉన్న ప్రాంతానికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో ఒక ప్రధాన భౌగోళిక లోపం (ఫాల్ట్‌) కూడా ఉన్నట్టు పేర్కొంది.

కూలిన ప్రాంతంలో 170 మీటర్ల బైపాస్‌ టన్నెల్‌

ఎస్‌ఎల్‌బీసీలో పైకప్పు కూలిన ప్రాంతానికి కాస్త దూరంలో బైపాస్‌ టన్నెల్‌ తవ్వాలని మరోసారి ఎన్‌జీఆర్‌ఐ సూచించింది. ఇన్‌లెట్‌ నుంచి 21వ కి.మీ. ప్రాంతంలో బలహీన క్వార్ట్జ్‌ రాయి, బలమైన గ్రానైట్‌ రాయి కలిసేప్రాంతం ఉందని తెలిపింది. గతంలో ఎన్‌జీఆర్‌ఐ చేసిన సూచనల మేరకు ప్రభుత్వం ఇప్పటికే బైపాస్‌ టన్నెల్‌ పని ప్రారంభించింది. ఇది పైకప్పు కూలిన షీర్‌జోన్‌ దాటాక తిరిగి ప్రతిపాదిత మార్గానికి కలుస్తుంది. అసలు టన్నెల్‌(9.2మీటర్లు)కంటే కాస్త ఎక్కువ వ్యాసంతో మొత్తం 170 మీటర్ల మేర బైపాస్‌ టన్నెల్‌ చేపట్టగా.. ఇప్పటివరకు 30 మీటర్ల మేర పూర్తయింది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రతిపాదిత ప్రాంతమంతా క్లిష్టమైన రాతి, మట్టిపొరలతో ఉండటంతో శాస్త్రీయంగా డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ (డీబీఎం) విధానంలో తవ్వుతున్నారు. సెన్సర్ల సాయంతో ముందున్న రాతి పొరల నిర్మాణాన్ని పరిశీలిస్తూ, ఆ డేటా ఆధారంగా ముందుకు వెళ్లాలని ఎన్‌జీఆర్‌ఐ నివేదికలో పేర్కొంది. 24 నుంచి 26 నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2026 | 07:05 AM