Share News

జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో విషాదం

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:13 AM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో ఓ నవజాత శిశువు జన్మించిన కొద్దిసేపటికే మృతి చెందిన ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో విషాదం

  • పుట్టిన గంటల వ్యవధిలోనే పసికందు మృతి

  • ఆక్సిజన్‌ అందకే మరణించాడంటూ బంధువుల ఆరోపణ

జహీరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో ఓ నవజాత శిశువు జన్మించిన కొద్దిసేపటికే మృతి చెందిన ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శిశువుకు సకాలంలో ఆక్సిజన్‌ అందించకపోవడం వల్లే ఊపిరాడక ప్రాణాలు వదిలాడని ఆరోపిస్తూ బాధితుల బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్టిపల్లికి చెందిన మనోహర ప్రసవం నిమిత్తం ఆదివారం జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెకు సాధారణ ప్రసవం కాగా, మగబిడ్డ జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పసికందు మృతిచెందడంతో.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్‌ చేశారు. ఆరోపణలను ఖండించిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌.. శిశువు పుట్టుకతోనే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ కొరత ఏమాత్రం లేదని.. నిబంధనల ప్రకారం ఎన్‌ఐసీయూలో చికిత్స అందించామని స్పష్టం చేశారు. సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని, ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని వివరణ ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. డిప్యూటేషన్‌పై వెళ్లిన సిబ్బందిని తిరిగి రప్పించాలని ఆదేశించారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Jul 06 , 2026 | 03:13 AM