పుట్టగానే ఆప్తుల నైజం తెలిసి.. గుక్కపెట్టి ఏడ్చి..
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:52 AM
అప్పుడే పుట్టిన శిశువు అంటే కన్నతల్లికే కాదు.. ఇంటిల్లిపాదికీ ముద్దే! అందుకే మహాకవి గుర్రం జాషువా శిశువు ను ‘తన ఇంటికి కొత్త పెత్తనపుదారు’గా అభివర్ణిస్తారు. ‘గానమాలింపక కన్నుమూయని రాజు....
బాన్సువాడ, సిరిసిల్లలో అప్పుడే పుట్టిన ఇద్దరు బిడ్డలను వదిలేసిన సొంత మనుషులు
అప్పుడే పుట్టిన శిశువు అంటే కన్నతల్లికే కాదు.. ఇంటిల్లిపాదికీ ముద్దే! అందుకే మహాకవి గుర్రం జాషువా శిశువు ను ‘తన ఇంటికి కొత్త పెత్తనపుదారు’గా అభివర్ణిస్తారు. ‘గానమాలింపక కన్నుమూయని రాజు’ అని, ‘ఊయల దిగని భాగ్యోన్నతుడు’ అని, ‘ఊఊలు నేర్చిన వింత చదువరి’ అని, ‘అమ్మతో తనకు ఎంత అనుబంధమున్నదో.. ఏడ్చి ఊడిగము చేయించుకొనును’ అని శిశువు సహజ లక్షణాలను కళ్లకు కడతారు జాషువా! మరి.. అప్పుడే పుట్టిన ఈ ఇద్దరు పసిగడ్లు గుక్కపెట్టి ఏడుస్తూ అనాథలుగా రోడ్ల మీద పడి ఉండటాన్ని చూసి ఉంటే గనక ఆ ఆవేదనను జాషువా మానవతావాదుల గుండెలు బరువెక్కేలా వ్యక్తపరిచి ఉండేవారేమో! గురువారం ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నవజాత శిశువులను గుర్తు తెలియని వ్యక్తులు వీధుల్లో వదిలేసి వెళ్లడం చర్చనీయాంశమైంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మదీనా కాలనీలోని ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో ఓ శిశువు ఏడుపు వినిపించింది. స్థానికులు వెళ్లేసరికి అక్కడ ఎండలో, ఒళ్లంతా అంటిన మట్టితో కటికనేల మీద ఓ మగబిడ్డ కనిపించాడు! పోలీసులొచ్చి శిశువును ఆస్పత్రికి తరలించారు. సిరిసిల్లలోనైతే మరీ ఘోరం! కొత్త బస్టాండ్‌లోని మూత్రశాలలో అప్పుడే పుట్టిన ఆడబిడ్డను వదిలేసి వెళ్లారు. రాత్రి ఏడుగంటలకు శిశువు ఏడ్పు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి ఆ బిడ్డను ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు శిశువులను వదిలేసి వెళ్లిందెవరు? అని తేల్చేపనిలో పోలీసులు పడ్డారు.