నిమిషాల్లోనే కొత్త వాహనం రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:13 AM
కొత్త వాహనాల కొనుగోలు దారులు, వాటి రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పడే కష్టాలు శనివారంతో తీరిపోయాయి.
గంటల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ నెంబర్ జారీ
వాహన షోరూంలలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం
మొదటి రోజు 490 వాహనాలకు రిజిస్ట్రేషన్లు
స్పీడ్ పోస్టులో నేరుగా యజమాని ఇంటికేఆర్‌సీ
తొలిరోజు కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కొత్త వాహనాల కొనుగోలు దారులు, వాటి రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పడే కష్టాలు శనివారంతో తీరిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా డీలర్ల (వాహన షోరూంలలో) వద్ద కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. సేవల్లో పారదర్శకత, రవాణా శాఖ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గించడం, ప్రజలకు సత్వర సేవలు అందించడంలో భాగంగా ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు 490 వాహనాలకు షోరూంలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. వాహనం కొనుగోలు చేసిన నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్కడికక్కడే పూర్తి అవుతుండటంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాహనం కొనుగోలు చేయగానేడిజిటల్ విధానంలో ఫారం 21 (సేల్స్ సర్టిఫికేట్), 22 (రోడ్ వర్తీనెస్ సర్టిఫికేట్), ఇన్సూరెన్స్ పత్రాలు, వాహనం ఫొటో, కొనుగోలుదారుడి చిరుమానా ఇతర వివరాలను రవాణా శాఖకు చెందిన వాహన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన వివరాలను రవాణా శాఖ అధికారులు పరిశీలించి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ జారీ చేస్తున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) కార్డు నేరుగా స్పీడ్ పోస్టులో వాహన యజమాని చిరునామాకు వస్తుంది. ప్రస్తుతం వ్యక్తిగత వాహనాలకు మాత్రమే ఈ విధానం అమల్లో ఉంది. ఇతర వాణిజ్య వాహనాలకు గతంలో మాదిరిగానే రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. పాత వాహనాల రిజిస్ట్రేషన్ మార్పిడి కోసం కూడా రవాణా శాఖ కార్యాలయాలకు నేరుగా వెళ్లాల్సిందే. కాగా, మొదటి రోజు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. విద్యుత్ వాహనాల (ఈవీ)కు తక్షణమే టీఆర్ నెంబర్ జనరేట్ కాగా, పెట్రోల్ వాహనాల విషయంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. రిజిస్ట్రేషన్లు మామూలుగా ఉంటే పర్మనెంట్ నెంబర్‌ను రిజిస్ట్రేషన్ చేసిన రోజే కేటాయిస్తామని, అధికంగా ఉంటే ఒకటి రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కొన్ని గంటల్లోనే నెంబర్ వచ్చేసింది...
డీలర్ వద్ద వాహన రిజిస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి కారును హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గిరీష్ కొనుగోలు చేశారు. ఈ విధానంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ‘మధ్యాహ్నం 12 గంటల సమయంలో షోరూంలో వివరాలు నమోదు చేయగా, సాయంత్రం 6 గంటలకు వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసింది’ అని గిరీష్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారికి అవసరమైన సేవలన్నీ షోరూంలోనే క్షణాల్లో దొరుకుతున్నాయని జాస్పర్ టాటా షోరూం మేనేజర్ చక్రపాణి తెలిపారు.