భూముల విలువల పెంపు..మళ్లీ వాయిదా
ABN , Publish Date - May 26 , 2026 | 05:18 AM
భూముల మార్కెట్ విలువల పెంపు మరికొన్ని రోజులు వాయిదా పడింది. పెంపును ప్రభుత్వం తొలుత 26 (మంగళవారం) నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ..
తొలుత నేటి నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రణాళిక
తర్వాత ఈ నెల 28 నుంచి అమల్లోకి అంటూ ప్రచారం
వాయిదా వేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు సర్కార్ సూచన
జూన్ 2వ తేదీ తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం
కొత్త మార్కెట్ విలువలతో సిద్ధంగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ
హైదరాబాద్, మే 25 (ఆంధ్ర జ్యోతి): భూముల మార్కెట్ విలువల పెంపు మరికొన్ని రోజులు వాయిదా పడింది. పెంపును ప్రభుత్వం తొలుత 26 (మంగళవారం) నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ.. తరువాత మే 28 నుంచి అమల్లోకి తేనున్నట్లు స్పష్టం చేసింది. అయితే, మళ్లీ వాయిదా వేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తొలుత నిర్ణయించిన తేదీలను తొలగించి.. మార్కెట్ విలువల అమలుకు సంబంధించిన దస్త్రాలను సిద్ధంగా ఉంచుకున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకల అనంతరం కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లూ చేశారు. 144 మంది సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో నూతన విలువలకు సంబంధించిన రికార్డులను అందుబాటులో పెట్టుకున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించినవి, ఫ్లాట్లు నూతన విలువలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా అప్‌లోడ్ చేశారు. తదుపరి తేదీపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాక.. సర్కారు ఇచ్చే ఉత్తర్వుల మేరకు కొత్త విలువలను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిసింది. నాలుగేళ్ల తరువాత భూముల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 వేల ప్రదేశాల్లో (లొకాలిటీల్లో) ఈ సవరణలు చేపట్టినట్లు సమాచారం. అయితే ఇందులో ఈ దఫా కొత్తగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మరో 8 వేల వరకు కొత్త ప్రదేశాలు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొత్త కాలనీలు, రోడ్లు, కలుపుకొని 93 వేల ప్రదేశాల్లో మార్కెట్ విలువల మదింపు జరిగింది. వీటిలో అత్యధిక శాతం 50 నుంచి 75 శాతం పెంపు శ్లాబులో ఉన్నట్టు తెలిసింది.
అలాగే కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కొన్ని చోట్ల గ్రామపంచాయతీలను విలీనం చేశారు. ఆయా పంచాయతీల్లో ధరలు చాలా స్వల్పంగా ఉండటంతో వాటిని వంద శాతం పెంచినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ శాఖ కార్డు విలువ గజం రూ.700 ఉన్నచోట్ల రూ.1500 చేశారు. గజం రూ.1500 ఉన్నచోట్ల రూ.3000 చేశారని తెలిసింది. అత్యధిక ప్రదేశాల్లో సగటున 25 శాతం పెరిగినట్లు సమాచారం. వ్యవసాయ భూముల విషయంలో గరిష్ఠంగా 45 శాతం వరకు పెంచారు. మేడ్చల్ జిల్లాలో దుండిగల్, బాచుపల్లి, నిజాంపేట వంటి ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువలు 35 శాతం నుంచి 50 శాతం వరకూ పెంచారు. కొన్ని చోట్ల వంద శాతం వరకు పెంచారు. గతంలో ఉన్న విలువలనే కొనసాగిస్తూ.. ఎలాంటి సవరణలూ చేయని ప్రాంతాలు రాష్ట్రవ్యాప్తంగా 2 శాతం లోపే ఉన్నాయని తెలిసింది. ఈ ప్రదేశాల్లో ఎలాంటి అభివృద్ధీ లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు కావడంతో అక్కడ గతంలో జరిగిన లావాదేవీలను బేరీజు వేసి ఈ దఫా పెంపు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.