Share News

kumaram bheem asifabad- అంగన్‌వాడీలకు కొత్త ఫోన్లు

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:03 PM

చిన్నారులకు చదువుతో పాటు పౌష్టికాహారాన్ని అందించే అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్‌ ఫోన్లు అందించనున్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పిల్లల హాజర్లు, పౌష్టికాహారం అందించే వివరాలను సెల్‌ఫోన్లలో టీచర్లు నమోదు చేస్తున్నారు.

kumaram bheem asifabad- అంగన్‌వాడీలకు కొత్త ఫోన్లు
లోగో

- వివరాల నమోదుకు తీరనున్న ఇబ్బందులు

- త్వరలో అందజేసేందుకు ఏర్పాట్లు

బెజ్జూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): చిన్నారులకు చదువుతో పాటు పౌష్టికాహారాన్ని అందించే అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్‌ ఫోన్లు అందించనున్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పిల్లల హాజర్లు, పౌష్టికాహారం అందించే వివరాలను సెల్‌ఫోన్లలో టీచర్లు నమోదు చేస్తున్నారు. ఫోషణ్‌, ఎన్‌ఎస్‌టీఎస్‌ అనే యాప్‌ల ద్వారా గర్భిణులు, బాలింతల ముఖగుర్తింపు కోసం ఫొటో తీయాల్సి ఉంటుంది. అదే విధంగా యుక్త వయసు పిల్లలకు పల్లీపట్టి అందిస్తున్నారు. ఈ వివరాలను కూడా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు, 1006అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1006మంది అంగన్‌వాడీ టీచర్లు, 40మంది ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, 5బ్లాక్‌ కో ఆర్డినేటర్లకు నూతన మొబైల్‌ ఫోన్లను అందించనున్నారు.

- గతంలో ఉన్న వాటి స్థానంలో..

అంగన్‌వాడీ టీచర్లకు కొన్నేళ్ల క్రితం సెల్‌ఫోన్లు అందించగా, అప్పట్లో 4జీ టెక్నాలజీ ఫోన్లను మాత్రమే అందించారు. వాటికి 5జీ టెక్నాలజీ సామర్థ్యం లేదు. ఎప్పుడో ఇచ్చిన ఫోన్లు చాలా వరకు చెడిపోయాయి. సిగ్నల్స్‌ సరిగా ఉండని ప్రాంతాల్లో టీచర్లు వాటిని ఉపయోగించడం కూడా కష్టతరంగా మారింది. దీంతో పోషణ్‌ యాప్‌ వినియోగించడం సెల్‌ఫోన్లతో సాధ్యపడేది కాదు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో సెల్‌ఫోన్లకు సిగ్నల్‌ సరిగా ఉండదు. ఆ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు పనిచేయక పోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇచ్చిన సెల్‌ఫోన్లకు అనేక సమస్యలు ఉత్పన్నం కావడంతో వినియోగించలేదు. ఈ సమస్య కారణంగా ప్రభుత్వం ఆధునాతన ఫీచర్లతో నూతన సెట్‌ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అది కూడా 5జీ నెట్‌వర్క్‌ సామర్థ్యం గల ఫోన్లు అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడంతో ఇక కష్టాలకు చెక్‌ పడనుంది.

- ప్రతీది పోషణ్‌ యాప్‌లోనే..

అంగన్‌వాడీ పరిధిలో ప్రతీది పోషణ్‌ యాప్‌లోనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సుమారు 14 రకాల వివరాలను అప్‌ డేట్‌ చేయాల్సి ఉంటుంది. కేంద్రం తెలిచిన సమయం నుంచి పిల్లల హాజరు, వారికి ఇచ్చే అల్పాహారం, వేడి భోజనం, పాలు, గుడ్ల పంపిణీ వివరాలను నమోదు చేయాలి. వీటితో పాటు గర్భిణులు, బాలింతల రిజిస్ట్రేషన్‌, పిల్లల ఎత్తు బరువు, వ్యాక్సిన్‌ల షెడ్యూల్‌, విటమిన్‌- ఏ డోసులు, హెల్త్‌ చెకప్‌ వంటి వివరాలు, హోమ్‌ విజిట్స్‌, బాలామృతం పంపిణీ వంటి సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. పాత ఫోన్ల ద్వారా ప్రస్తుతం సిబ్బంది అవస్థలు పడుతున్నారు. గతంలో ఇచ్చిన 4జీ మొబైల్‌ ఫోన్లు మరమ్మత్తులకు గురికావడం, ఉన్న ఫోన్లలో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో పాటుసాంకేతిక సమస్యలు తలె త్తడంతో అంగన్‌వాడీ టీచర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక త్వరలోనే నూతన 5జీ టెక్నాలజీ ఫోన్లను ప్రభుత్వం అందించేందుకు సమాయత్తమవుతుండడంతో అంగన్‌వాడీల సమస్యలు తీరనున్నాయి.

ప్రభుత్వం నుంచి రాగానే పంపిణీ..

- అడెపు భాస్కర్‌, జిల్లా సంక్షేమ అధికారి

ప్రభుత్వం నూతన పోన్లను ఇచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం. ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు నూతన మొబైల్‌ ఫోన్లు ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. సెల్‌ఫోన్ల ద్వారనే టీచర్లు విధులు నిర్వమించాల్సి ఉండడంతో వాటి అవసరం ఎంతో ఉంది.

Updated Date - Mar 26 , 2026 | 11:03 PM