Share News

ఆ నలుగురూ..

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:13 AM

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో కాల్పులు, డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రత్యేక పోలీసు బృందం (సిట్‌) జరుపుతున్న విచారణలో కొత్త విషయాలు, కొత్త వ్యక్తుల పాత్రలు బయటపడుతున్నాయి.

ఆ నలుగురూ..

  • రోహిత్‌రెడ్డి, ప్రియాంక, బాలాజీ, అర్జున్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ పార్టీలు

  • మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసులో వెలుగులోకి కొత్త వ్యక్తులు

  • తాజాగా అరెస్ట్‌ అయిన ప్రముఖ వైద్యుడికి గోవా లింకులు

  • ముగిసిన నిందితుల కస్టడీ.. పొడిగింపు పిటిషన్‌ తిరస్కరణ

  • 8 వరకూ జ్యుడిషియల్‌ రిమాండ్‌..

  • చంచల్‌గూడకు నిందితులు

  • కౌంటర్‌కు గడువు కోరిన నిందితుల తరఫు న్యాయవాదులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/శంషాబాద్‌/రాజేంద్రనగర్‌/మొయినాబాద్‌)

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో కాల్పులు, డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రత్యేక పోలీసు బృందం (సిట్‌) జరుపుతున్న విచారణలో కొత్త విషయాలు, కొత్త వ్యక్తుల పాత్రలు బయటపడుతున్నాయి. ఈ కేసు నిందితుల్లో నలుగురు.. రోహిత్‌రెడ్డితో పాటు, పోలీసులు తాజాగా అరెస్టు చేసిన ప్రముఖ వైద్యుడు బాలాజీ, బాబీలోన్‌ పబ్‌ నిర్వాహకుడు అర్జున్‌రెడ్డి, ప్రియాంకరెడ్డిలు వారాంతపు డ్రగ్‌ పార్టీలు నిర్వహిస్తున్నారని, వాటికి తరచూ కొందరు ప్రముఖులను కూడా పిలుస్తున్నారని పోలీసులు గుర్తించారు. రోహిత్‌రెడ్డికి నాలుగేళ్లుగా డ్రగ్స్‌ అలవాటు ఉందని.. అప్పటి నుంచే ఈ పార్టీలు జరుగుతున్నాయని తెలిసింది. అలాగే.. డాక్టర్‌ బాలాజీకి గోవాలోని డ్రగ్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. అలాగే, కొన్నిసార్లు ఈ పార్టీలకు రోహిత్‌ రెడ్డి డ్రైవర్‌ శరత్‌ కూడా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు తేలింది. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌, జూబ్లీహిల్స్‌లో ఈ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇప్పటికే డ్రగ్స్‌ కేసులో సప్లయర్లు అభిషేక్‌ సింగ్‌, రాకేష్‌ వర్మ, బాలాజీతో పాటు మరో వ్యక్తి పేరు తెరమీదకు వచ్చింది. దీంతో ఈ కేసులో గుర్తించిన నిందితుల సంఖ్య 15కి చేరింది. మరికొందరి పేర్లు బయటకు వస్తున్నాయని త్వరలో వీరిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.


కోర్టుకు నిందితులు..

ఈ కేసులో ప్రధాన నిందితులైన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, నమిత్‌శర్మ, రితీశ్‌రెడ్డిల 3 రోజుల పోలీసు కస్టడీ గురువారం ముగిసింది. వారి కస్టడీని పొడిగించాలని కోరుతూ పోలీసులు ఉప్పరిపల్లిలోని రాజేంద్రనగర్‌ 12వ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. నిందితులను సిట్‌ బృందం రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరిచింది. ఇంకా నిగ్గుతేలాల్సిన అంశాలున్నాయని.. కాబట్టి వారిని మరో ఐదురోజుల పాటు కస్టడీకివ్వాలని పోలీసులు కోర్టును కోరారు. న్యాయమూర్తి కస్టడీ పొడిగింపును తిరస్కరించారు. జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఏప్రిల్‌ 8 వరకూ పొడిగించారు. దీంతో ఈ ముగ్గురినీ తిరిగి చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. కాగా.. పోలీసులు కస్టడీ కోసం వేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని నిందితులు తరఫు న్యాయవాదులు కోరారు. దీనికి కోర్టు అనుమతిచ్చిందని.. న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Mar 27 , 2026 | 04:13 AM