Share News

పేదల జీవితాల్లో కొత్త వెలుగులు!

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:09 AM

పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి మంజూరు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఏళ్లుగా పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న

  పేదల జీవితాల్లో కొత్త వెలుగులు!

పెద్దపల్లి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి మంజూరు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఏళ్లుగా పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి ఎట్టకేలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 19న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్‌ సొమ్మును జమ చేయనున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలన, క్షేత్రస్థాయి ధ్రువీకరణ ప్రక్రియ కొంతకాలం కొనసాగింది. ఎప్పుడెప్పుడు అర్హుల జాబితా ప్రకటిస్తారా.. తమకు పింఛన్‌ వస్తుందా లేదా అని వేలాది మంది ఆశగా ఎదురుచూశారు. పరిశీలన అనంతరం అర్హులైన వారిని ఎంపిక చేసి మంజూరు పత్రాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఫ జిల్లాలో 11,804 మందికి లబ్ధి

జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల పరిధిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. వీటిలో అర్హులుగా గుర్తించిన 11,804 మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. సాంకేతిక కారణాలు, అర్హతల పరిశీలనలో తలెత్తిన సమస్యలతో మరికొందరికి ఈ విడతలో పింఛన్లు మంజూరు కాలేదు. వారికి రెండో విడత అవకాశం కల్పించ నున్నట్లు ప్రకటించారు. కొత్తగా ఎంపికైన వారితో పాటు ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వేలాది మంది లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం చెల్లింపులు కొనసాగించనుంది.

ఫ 19న ఖాతాల్లో నగదు జమ

కొత్తగా పింఛన్లు మంజూరైన జిల్లా లబ్ధిదారుల కోసం నెలకు రూ.2,84,56,864 చెల్లించనున్నారు. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారితో కలిపి జిల్లాలో ప్రతీనెలా సుమారు రూ.19.64 కోట్ల పింఛన్‌ సొమ్ము పంపిణీ అవుతోంది. ఈ నెల 19న కొత్తగా ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్‌ జమ చేయను న్నారు. మంజూరు పత్రాలు చేతికి అందడంతో పాటు ఖాతాల్లో నగదు జమ కానుండటంతో కొత్తగా ఎంపికైన కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఫ ఎదురుచూపులకు ఫలితం.. కుటుంబాలకు భరోసా

వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన నిరుపేద కుటుంబాలకు పింఛన్‌ జీవనాధారంగా ఉంది. నిత్యావసరాలు, మందులు, వ్యక్తిగత అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా కొంత స్వతంత్రంగా జీవించేందుకు ఈ సాయం తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ల మంజూరుతో జిల్లాలో 11,804 కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించ నుంది. అయితే సాంకేతిక కారణాలతో ఎంపిక కానివారి దరఖాస్తులను మరోసారి పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌ కూడా వినిపిస్తోంది.

Updated Date - Nov 14 , 2026 | 02:09 AM