Telugu States: కొత్త అల్లుళ్లా.. మజాకా!
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:19 AM
పండుగన్నాక రెండు రకాల కూరలు, పప్పు, రసం, పులిహోర, కారప్పూస, సకినాలు, ఆపై కాసిన్ని అరిసెలో, లడ్డూలో వడ్డిస్తే అవే ఎక్కువని కడుపునిండా తింటాం.
ఔరౌర గారెలల్ల.. అయ్యారే బూరెలిల్ల!
ఇంటర్నెట్ డెస్క్: పండుగన్నాక రెండు రకాల కూరలు, పప్పు, రసం, పులిహోర, కారప్పూస, సకినాలు, ఆపై కాసిన్ని అరిసెలో, లడ్డూలో వడ్డిస్తే అవే ఎక్కువని కడుపునిండా తింటాం. మరి.. ఈ పదార్థాల జాబితా 10-15 రెట్లుగా ఉంటే? 150.. 250.. 1574 పై చిలుకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ముందు పరిచేసి లాంగించేయవోయీ అంటూ కొసరి కొసరి వడ్డిస్తే? తెలుగు రాష్ట్రాల్లోని కొత్త అల్లుళ్లకు అత్తింటివారు సంక్రాంతికి ఇలానే మర్యాదలు చేసి, అభిమానాన్ని చాటుకుంటే ఆ అల్లుళ్లు మురిసిపోయారు. ఏపీలోని కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రులో కొత్తల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు ఏర్పాటుచేసి హౌరా అనిపించారు. అలాగే మొగల్తూరు పంచాయతీ నల్లంవారితోటలో కొత్తల్లుడికి 260 వంటకాలు, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం లో 1,116రకాల పిండి వంటలతో వడ్డించారు. అలాగే, కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన గర్రె శ్రీనివాసరావు- పారిజాతం దంపతుల కుమార్తె ప్రణీతకు విజయవాడకు చెందిన దత్త రామకృష్ణతో ఇటీవలే పెళ్లయింది. తొలి సంక్రాంతి అని అత్తామామలు కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచారు. 271 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా వర్నికి చెందిన కాకినాడ రాంబాబు, లక్ష్మీ దంపతులు తమ కూతురు నందిని, అల్లుడు కాజ సతీశ్‌చంద్రలను వర్నికి ఆహ్వానించి 150 రకాల వంటకాలను అరిటాకుల్లో పరిచారు.

- ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్