Telangana Government: పెద్దాసుపత్రులకు పంపాలంటే కారణం రాయాల్సిందే!
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:09 AM
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను ఇకపై ఇష్టారాజ్యంగా పెద్దాసుపత్రులకు రిఫర్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు..
చిన్న కేసులకు జిల్లా కేంద్రాల్లోనే వైద్యం..
గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌పై భారం తగ్గించేందుకే.. సర్కారు కొత్త విధానం!
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను ఇకపై ఇష్టారాజ్యంగా పెద్దాసుపత్రులకు రిఫర్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు..! చిన్న చిన్న కేసులను కూడా జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు పంపుతూ.. అక్కడి వైద్య వ్యవస్థపై భారం మోపుతున్న తీరుపై సర్కారు సీరియస్ అయ్యింది. అత్యవసరమైతే తప్ప, జిల్లాల కేసులను జిల్లా కేంద్రాల్లోనే పరిష్కరించేలా కఠిన నిబంధనలతో సర్కారు కొత్త విధానాన్ని తెస్తోంది. ఒకవేళ రిఫర్ చేయాల్సి వస్తే.. ఎందుకు పంపిస్తున్నారో కేస్ షీట్‌లో స్పష్టమైన కారణం రాయాల్సి ఉంటుంది. అలాగే కేవలం డిశ్చార్జ్ షీట్ ఇచ్చి పేషెంట్‌ను పంపించేస్తే సరిపోదు. సదరు పేషెంట్‌ను ఏ ఆసుపత్రికి పంపిస్తున్నారో.. అక్కడి డాక్టర్లకు ముందే ఫోన్ చేసి సమాచారమివ్వాలి. పేషెంట్ వెళ్లాక.. అడ్మిట్ అయ్యాడా? లేదా? అనే విషయాన్ని కూడా పంపిన డాక్టరే ఫాలోఅప్ చేయాలి. పేషెంట్లకు సేవలు అందుబాటులో ఉన్న సమీప ఆసుపత్రికే రిఫర్ చేయాలి తప్ప.. నేరుగా హైదరాబాద్‌కు పంపకూడదు. ఇక ఏ ఆసుపత్రిలో ఏయే సేవ లు అందుబాటులో ఉన్నాయి? ఏ స్పెషలిస్ట్ డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు? అనే సమాచారం మొత్తం ఒకే దగ్గర అందుబాటులో ఉండేలా సాంకేతికతను వినియోగించుకోనున్నారు. దీనివల్ల పేషెంట్‌ను ఎక్కడికి పంపాలనేది డాక్టర్లకు సులువుగా తెలుస్తుంది. ఇక రిఫర్ చేసే సమయంలో ఇచ్చే కేస్ షీట్, డిశ్చార్జ్ సమ్మరీలో పూర్తి వివరాలుండాలి. తమ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఏం ట్రీట్‌మెంట్ ఇచ్చారు? ఇప్పుడు పం పిస్తున్న ఆసుపత్రిలో ఏ ట్రీట్‌మెంట్ కోసం పంపిస్తున్నారు? అనే విషయాలు స్పష్టంగా పేర్కొనాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత రిఫరల్ సిస్టమ్‌లో ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించి, కొత్త విధానం అమలుకు సంబంధించి ఓ కమిటీని వేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.