Share News

కొనుగోలుదారు అఫిడవిట్‌ ఇస్తే చాలు

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:09 AM

సాదాబైనామా సమస్యను మరింత సరళంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం జీవో నం.76 తీసుకొచ్చింది. దాని ప్రకారం విక్రయదారు నుంచి అఫిడవిట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు.

కొనుగోలుదారు అఫిడవిట్‌ ఇస్తే చాలు

  • అమ్మకందారు ఇవ్వాల్సిన అవసరం లేదు

  • సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి జీవో 76

  • తొలగిన ఆటంకం.. అఫిడవిట్‌ తప్పని తేలితే క్రిమినల్‌ కేసులు

  • అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు

  • అభ్యంతరాలొస్తే మొత్తం ప్రక్రియ నిలిపివేత

  • 9.26 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం

  • సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు

  • కొత్త మార్గదర్శకాలు.. చిన్న రైతులకు ప్రభుత్వం ఊరట

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామా సమస్యను మరింత సరళంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం జీవో నం.76 తీసుకొచ్చింది. దాని ప్రకారం విక్రయదారు నుంచి అఫిడవిట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొనుగోలుదారు అఫిడవిట్‌ ఇస్తే సరిపోతుంది. అలాగే సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు జీవో నం.77 ద్వారా చిన్న రైతులకు ఊరట కల్పించింది. దీని ప్రకారం.. చిన్న, సన్నకారు రైతుల భూములపై ఉన్న సాదాబైనామా లావాదేవీలను పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా 5 ఎకరాల వరకు భూములపై ఉన్న క్లెయిమ్‌లకు ఇది వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను కలెక్టర్లు అమలు చేస్తారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి జీవో నం.76 తీసుకొచ్చినట్లు ప్రకటించారు. కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచీ అఫిడవిట్‌ తీసుకోవాలన్న నిబంధనతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్‌ తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి పరిష్కారం లభించబోతోందన్నారు. ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించినా.. 2020 నాటి ఆర్‌వోఆర్‌ చట్టంలో పరిష్కార మార్గం చూపలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంతో ఈ సమస్యకు పరిష్కారం చూపించామన్నారు. అయితే కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచీ అఫిడవిట్‌ తీసుకోవాలన్న నిబంధనతో ఎదురవుతున్న సమస్యలను దృష్ట్యా జీవో 76 తీసుకొచ్చామని చెప్పారు. ఇక కొనుగోలుదారు అఫిడవిట్‌ ఇస్తే చాలని తెలిపారు. కాగా, సాదాబైనామా దరఖాస్తుదారులు ఇచ్చిన అఫిడవిట్‌లోని వివరాలు అవాస్తవమని తేలినా, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారని గుర్తించినా వారిపై క్రిమినల్‌ కేసులు పెడతారని ఉత్తర్వులో పేర్కొన్నారు. సాదాబైనామా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతో పాటు ఫీజు, స్టాంప్‌ డ్యూటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దరఖాస్తుదారు తాను చెప్పే విషయాలు వాస్తవాలేనని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. సాదాబైనామా దరఖాస్తులపై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఆర్డీవో సంబంధిత భూముల వివరాలను భూభారతి పోర్టల్‌లో 30 రోజుల పాటు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఏవైనా అభ్యంతరాలు వస్తే సాదాబైనామా దరఖాస్తు ప్రక్రియను నిలిపివేస్తారని ఉత్తర్వులు పేర్కొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 04:09 AM