Hair Regrowth: బట్టతలకు కొత్త మందు
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:30 AM
అందం మీద చాలామంది మగవారికి పెద్దగా పట్టింపు ఉండదుగానీ.. బట్టతల వస్తే మాత్రం బాగా ఫీలవుతారు. చాలా మంది ఈ సమస్య కారణంగా ఆత్మనూన్యత భావంతో......
జట్టును మొలిపించే సరికొత్త ఔషధం క్లాస్కోటెరోన్
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): అందం మీద చాలామంది మగవారికి పెద్దగా పట్టింపు ఉండదుగానీ.. బట్టతల వస్తే మాత్రం బాగా ఫీలవుతారు. చాలా మంది ఈ సమస్య కారణంగా ఆత్మనూన్యత భావంతో కుంగిపోతుంటారు. వారి సామాజిక జీవితంపై కూడా బట్టతల ఎంతో ప్రభావం చూపుతుంది. అలాంటివారందరికీ శుభవార్త. తీవ్ర దుష్ప్రభావాలేవీ లేకుండానే బట్టతలపై (మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్) జుట్టు పెరుగుదలకు తోడ్పడే ఒక కొత్త పైపూత మందు త్వరలో అందుబాటులోకి రాబోతోంది! దాని పేరు.. క్లాస్కోటెరోన్ 5ు. మొటిమలను తగ్గించడానికి ఇప్పటికే ఈ మందును (‘విన్‌లెవి’ అనే బ్రాండ్‌నేమ్‌తో) వాడుతున్నారు. అందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతులు కూడా ఉన్నాయి. ఆ మందు బట్టతలకు కూడా బాగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. బట్టతలపై జుట్టు మొలిపించడానికి ప్రస్తుతం వాడుతున్న ఫినాస్టెరైడ్ వంటి ‘యాంటీ-యాండ్రోజెన్’ మాత్రల వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, పలు దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. కానీ ఈ ‘క్లాస్కోటెరోన్ లోషన్ రూపంలో నేరుగా జుట్టు కుదుళ్లపై మాత్రమే పనిచేస్తుందని.. ‘డైహైడ్రోటెస్టోస్టెరాన్ (డీహెచ్‌టీ)’ అనే హార్మోన్ జుట్టు కుదుళ్లను బలహీనపరచకుండా ఇది నేరుగా అడ్డుకుంటుందని పరిశోధకులు తెలిపారు. అయితే, క్లినికల్ ట్రయల్స్‌ను ఆరు నెలలపాటు నిర్వహించారని.. ట్రయల్స్‌లో ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించనప్పటికీ, ఈ మందు దీర్ఘకాల వినియోగం వల్ల కలిగే ప్రభావాలపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అలాగే, ఈ మందు డీహెచ్‌టీ కారణంగా వచ్చే ‘ఆండ్రోజెనెటిక్ అలోపేసియా (బట్టతల)’కు మాత్రమే పనిచేస్తుంది తప్ప ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల, పోషకాహార లేమి వల్ల, గాయాల కారణంగా ఊడిపోయే జుట్టును తిరిగి మొలిపించలేదని వారు పేర్కొంటున్నారు.
క్లినికల్ ట్రయల్స్ ఇలా..
క్లాస్కోటెరోన్‌కు సంబంధించి.. అమెరికా, ఐరోపా దేశాల్లో మొత్తం 1,465 మంది పురుషులపై ఇప్పటికే రెండు ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించారు. సాధారణ మందులతో పోలిేస్త, క్లాస్కోటెరోన్ వాడిన వారిలో జుట్టు సాంద్రత 1.68 రెట్లు పెరిగినట్టు ఒక ట్రయల్‌లో తేలగా.. 5.39 రెట్లు అధికంగా పెరిగినట్లు మరో ట్రయల్‌లో తేలింది. ఆరు నెలల పాటు నిర్వహించిన ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నవారెవరికీ ఎటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలూ తలెత్తలేదు. దీన్ని వాడిన వారంతా సంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి బట్టతల చికిత్స విభాగంలో గత 30 ఏళ్లుగా ఎటువంటి విప్లవాత్మక మార్పులు రాలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు పరిమిత ఫలితాలను మాత్రమే ఇస్తున్నాయి. కొందరికి వాటివల్ల దుష్ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘క్లాస్కోటెరోన్’ రాక ఒక సరికొత్త ఆశగా నిలుస్తోంది. కాగా.. 2026 నాటికి ఈ ట్రయల్స్‌కు సంబంధించిన తుది నివేదికలు సిద్థం చేసి, అమెరికా (ఎఫ్‌డీఏ), ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థల అనుమతి కోసం దరఖాస్తు చేయనున్నట్లు కాస్మో ఫార్మా సీఈవో జియోవన్నీ డి నాపోలి తెలిపారు.
కొవిడ్ తర్వాత సమస్య పెరిగింది
క్లాస్కోటెరోన్ లోషన్‌పై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. ఇటీవలే ఈ ఔషధంపై ఒక వెబినార్ కూడా నిర్వహించారు. అందులో క్లినికల్ ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాల గురించి వివరించారు. కొవిడ్ తర్వాత.. జుట్టు రాలే సమస్యతో డెర్మటాలజిస్టుల వద్దకు వచ్చే స్త్రీ, పురుషుల సంఖ్య బాగా పెరిగింది. ఈ సమస్యకు ఎక్కువగా మినాక్సిడిల్‌ను సిఫారసు చేస్తుంటాం. అలాగే బయోటిన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. జట్టు రాలే సమస్యను తొలిదశలోనే గుర్తించి వస్తే పరిష్కారం దొరుకుతుంది. బాగా బట్టతల వస్తే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరి. ప్రస్తుతం కాస్మటాలజీ పేరుతో కొందరు ప్రచారం చేసుకుని డెర్మటాలజీ వైద్య సేవలను అందిస్తున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. కేవలం ఎండీ డీవీఎల్, డిప్లొమో డీవీఎల్ విద్యా అర్హత ఉన్న వైద్యుల దగ్గరే డెర్మటాలజీ సేవలు పొందాలి. నకిలీ వైద్యుల దగ్గరకు వెళితే ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలొచ్చే ప్రమాదం ఉంది.
-డా. రత్నకిషోర్, డెర్మటాలజిస్టు, ఎల్‌ఆర్కే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్, హైదరాబాద్