Share News

కొత్త చట్టాల అమలులో సమన్వయం కీలకం

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:14 AM

నేరాలకు సంబంధించిన కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్ఎస్ ), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఎ) అమలులో డిజిటల్‌ వేదికల వినియోగం..

కొత్త చట్టాల అమలులో సమన్వయం కీలకం

  • డిజిటల్‌ వేదికలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి

  • జ్యుడీషియల్‌ అకాడమీ, పోలీసు శాఖ సంయుక్త సదస్సులో సీజే జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): నేరాలకు సంబంధించిన కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్ఎస్ ), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఎ) అమలులో డిజిటల్‌ వేదికల వినియోగం, వివిధ విభాగాల మధ్య సమన్వయం కీలకమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. వివిధ సంస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే న్యాయం సాధ్యమవుతుందన్నారు. నేరం నమోదైనప్పటి నుంచి దర్యాప్తు, ఫోరెన్సిక్‌, ప్రాసిక్యూషన్‌, న్యాయస్థానంలో విచారణ వరకు ప్రతి దశ కీలకమని చెప్పారు. న్యాయవ్యవస్థ, పోలీసు, జైళ్లు, ప్రాసిక్యూషన్‌, ఫోరెన్సిక్‌, వైద్య విభాగాలతో పాటు ఎన్‌ఐసీ, ఎన్‌సీఆర్‌బీ వంటి సంస్థలను కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తూ తెలంగాణ జ్యుడీషియల్‌ అకాడమీ, తెలంగాణ పోలీసు శాఖ సికింద్రాబాద్‌లోని జ్యూడీషియల్‌ అకాడమిలో గురువారం సదస్సును నిర్వహించాయి. దేశంలోనే తొలిసారిగా కొత్త నేర చట్టాల డిజిటల్‌ అమలుకు సంబంధించిన అన్ని భాగస్వామ్య సంస్థలను ఒకే వేదికపైకి తీసుకుని వచ్చిన కార్యక్రమంగా ఇది నిలిచింది. జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ చొరవతో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1200 మంది న్యాయాధికారులు, పోలీసు, ప్రాసిక్యూషన్‌, జైళ్లు తదితర శాఖల అధికారులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో పాల్గొన్నారు.


సదస్సును ప్రారంభిస్తూ జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ.. కొత్త నేర చట్టాల అమలులో సంస్థల మధ్య సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. జ్యుడీషియల్‌ అకాడమి చైర్‌పర్సన్‌ జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిభారం పెరగకుండా ప్రక్రియలను సులభతరం చేసుకోవాలన్నారు. ఒకే సమాచారాన్ని పదే పదే నమోదు చేయడం వల్ల కేసుల పరిష్కారంలో అనవసర జాప్యం జరుగుతోందని, పోలీసు స్టేషన్లలో ఆన్‌లైన్‌లో కేసుల వివరాలు పొందుపరిచే సమయంలో తప్పుల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. శాస్త్రీయంగా దర్యాప్తు జరపటం, డిజిటల్‌ ఆధారాలతో పౌరులకు సత్వరం న్యాయం అందించడం లక్ష్యంగా వ్యవస్థలు పనిచేయాలని ఆకాంక్షించారు. సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విజయసేనారెడ్డి, మాధవిదేవి, ఎన్‌సీఆర్‌బీ ప్రతినిధి ప్రశూన్‌ గుప్తా, ఎఫ్‌ఎ్‌సఎల్‌ డైరక్టర్‌ శిఖాగోయల్‌, జ్యుడీషియల్‌ అకాడమి ప్రిన్సిపాల్‌ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 06:15 AM