Share News

Hot Air Balloon Festival: పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం..

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:56 AM

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ’హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌ ఫెస్టివల్‌’ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Hot Air Balloon Festival: పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం..

  • గోల్కొండలో ‘హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌’ను ప్రారంభించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ’హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌ ఫెస్టివల్‌’ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ ప్రపంచ స్థాయి వేదిక అని చాటి చెప్పేందుకు.. అంతర్జాతీయ స్థాయిలో వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం మంత్రి గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్‌ క్లబ్‌ వేదికగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బెలూన్‌లో గంటన్నరసేపు గగనతలంలో విహరించి 13 కి.మీ. దూరంలోని అప్పాజీగూడ శివారులో దిగారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘ఓవైపు ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో ఆతిథ్యాన్ని చాటుతుండగా, మరోవైపు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, డ్రోన్‌ ఫెస్టివల్స్‌ ద్వారా ఆధునిక సాంకేతికతను, భవిష్యత్తు దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ‘డెస్టినేషన్‌ తెలంగాణ’ అనే బ్రాండ్‌ను బలోపేతం చేస్తూ.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా తెలంగాణలోని సహజ సౌందర్యాన్ని, చారిత్రక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని అన్నారు. ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షిస్తూ, భాగస్వామ్య పద్ధతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నాణ్యమైన సేవలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. ఆకాశంలో ఎగురుతున్న ఈ బెలూన్లు.. తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచ స్థాయి ఎత్తులకు చేరుకోబోతోందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రాంతి వల్లూరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 06:57 AM