ఉపకరణాలకే కాదు.. ఇక భవనాలకూ స్టార్ రేటింగ్!
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:28 AM
ఇంట్లో వినియోగించే ఏసీలు, ఫ్రిజ్‌ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలకే కాదు... ఇకపై ఆయా భవనాలకూ స్టార్ రేటింగ్ ఉండాల్సిందే.!
20 వేల చదరపు మీటర్లు దాటిన బిల్డింగులకు కొత్త రూల్స్
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో వినియోగించే ఏసీలు, ఫ్రిజ్‌ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలకే కాదు... ఇకపై ఆయా భవనాలకూ స్టార్ రేటింగ్ ఉండాల్సిందే.! దేశంలో భవనాల ద్వారా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగి పోతుండడం, కర్బన ఉద్గారాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంధన పొదుపును ప్రొత్సహించడం, సుస్థిర నిర్మాణాలకు ఊతమివ్వడం, జాతీయ స్థాయిలో ఒకే ప్రమాణాలను అమలు చేయడం లక్ష్యంగా భవనాలకు కూడా ‘స్టార్ రేటింగ్ వ్యవస్థ’ను ప్రవేశపెట్టాలని కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. 20 వేల చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నిర్మాణ విస్తీర్ణం కలిగిన కొత్త వాణిజ్య, కార్యాలయ, నివాస భవనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. భవనాల నిర్వాహకులు.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) గుర్తింపు పొందిన సంస్థలతో ఎనర్జీ ఆడిట్ చేయించుకుని తప్పనిసరిగా రేటింగ్ పొందాల్సి ఉంటుంది. ఈ డ్రాఫ్ట్‌పై 21 రోజుల్లోగా ప్రజలు, ప్రభావిత వర్గాలు తమ సూచనలు, అభ్యంతరాలు తెలపవచ్చని, పరిశీలన అనంతరం తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని గురువారం కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టెయినబుల్ బిల్డింగ్ కోడ్ (ఈసీఎస్‌బీసీ) ప్రమాణాల ఆధారంగా భవనాలకు ఫైవ్ స్టార్ , ఫోర్ స్టార్, త్రీ స్టార్ రేటింగులు దక్కనున్నాయి. రేటింగ్ పొందిన నిర్వాహకులు ఆ వివరాలను భవనం వద్ద స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు ప్రచార సామగ్రిలోనూ పొందుపరచడం తప్పనిసరి చేశారు. రేటింగ్ నమోదు కోసం దరఖాస్తు రుసుం నివాస భవనాలకు రూ. 50వేలు, ఇతర భవనాలకు రూ. లక్షగా నిర్ణయించారు.