Share News

పంజా విసిరిన మరో నేపాలీ ముఠా

ABN , Publish Date - May 14 , 2026 | 04:34 AM

నేపాలీ ముఠా సభ్యులు విశ్రాంత ఐపీఎస్‌ అఽధికారి భార్యను హత్య చేసిన ఘటన మరువకముందే.. జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కౌకూర్‌ ..

పంజా విసిరిన మరో నేపాలీ ముఠా

  • పుట్టినరోజు వేడుకల పేరిట యజమానులకు మత్తుమందు

  • కుర్చీలకు కట్టేసి 60 తులాల బంగారం, 15 కేజీల వెండి, డాలర్లు చోరీ

బిట్స్‌ పిలానీ, మే 13(ఆంధ్రజ్యోతి): నేపాలీ ముఠా సభ్యులు విశ్రాంత ఐపీఎస్‌ అఽధికారి భార్యను హత్య చేసిన ఘటన మరువకముందే.. జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కౌకూర్‌ గోల్ఫ్‌ ఎన్‌క్లేవ్‌లో మరో నేపాలీ గ్యాంగ్‌ చేసిన దోపిడీ ఘటన వెలుగులోకి వచ్చింది. నేపాలీ దంపతులు పనిలో చేరి పక్షం రోజులు కాకముందే పుట్టిన రోజువేడుక పేరుతో యజమానులైన వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి ఇల్లుగుల్ల చేసిన సంఘటన ఆందోళన కలిగించింది. కౌకూర్‌ గోల్ఫ్‌ ఎన్‌క్లేవ్‌లో విశ్రాంత ప్రొఫెసర్‌ మురళీమోహన్‌(68), ఆయన భార్య డాక్టర్‌ విజయలక్ష్మి(58) నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో పనిచేసేందుకు నేపాలీ దంపతులు 13 రోజుల క్రితం చేరారు. యజమానుల వద్ద భారీగా బంగారం, డబ్బు ఉన్నట్లు తెలుసుకుని దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. పథకంలో భాగంగా నేపాల్‌కు చెందిన ఓ మహిళను తమ బంధువు పేరుతో ఇంటికి పిలిపించారు. పనిలో సాయంగా ఉంటుందని యజమానులను కోరడంతో వారు అనుమతించారు. వెంటనే నేపాలీ ముఠా దోపిడీకి పథకం వేసింది. కొత్తగా వచ్చిన మహిళ పుట్టిన రోజు అని సోమవారం వేడుక చేసుకుంటామని యజమానులకు చెప్పారు. బంధువుల పేరుతో ఆ రోజు మరో నలుగురిని పిలిచారు. వీరంతా కలిసి సోమవారం ఉదయాన్నే కేక్‌ కోసి అందులో మత్తు మందు కలిపి యజమానులకు ఇచ్చారు. అది తిని మత్తులోకి జారుకుంటున్న సమయంలో దోపిడీ పథకాన్ని గుర్తించిన మురళీమోహన్‌ దంపతులు వారికి కావాల్సిన సొత్తు తీసుకెళ్లమని, తమను చంపవద్దని వేడుకున్నారు. అంతలోనే స్పృహ తప్పిన వారిని బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి కాళ్లుచేతులు కట్టేశారు. బీరువాలు, అల్మారాలు పగలగొట్టి 60తులాల బంగారు ఆభరణాలు, 15 కేజీల వెండి, 3వేల డాలర్లు, ఇతర విలువైన వస్తువులను తీసుకుని.. ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. అప్పటినుంచి మంగళవారం సాయంత్రం వరకు బాధితులు మత్తులోనే ఉండిపోయారు. ఆ తర్వాత మురళీమోహన్‌ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఇంటి తాళాలు పగులగొట్టి కాపాడారు. ఘటనాస్థలాన్ని మల్కాజిగిరి సీపీ సుమతి పరిశీలించారు. నేపాల్‌ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 04:34 AM