దేశం దాటేసిన ఆ నేపాలీ ముఠా!
ABN , Publish Date - May 31 , 2026 | 05:55 AM
రిటైర్డ్ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ భార్య హత్య, దోపిడీ కేసులో పనిమనిషి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా దేశం దాటి నేపాల్‌లోకి పారిపోయినట్లు పోలీసులు...
మాజీ ఐపీఎస్ భార్య హత్య, దోపిడీ కేసు
నేపాల్‌కు ప్రత్యేక పోలీసు బృందం
ఎక్కడున్నా పట్టుకొస్తాం: సజ్జనార్
హైదరాబాద్ సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ భార్య హత్య, దోపిడీ కేసులో పనిమనిషి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా దేశం దాటి నేపాల్‌లోకి పారిపోయినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం రంగంలోకి దిగిన 10 పోలీసు బృందాలు భారత్-నేపాల్ సరిహద్దుతో పాటు పుణె, ముంబై, డిల్లీ... యూపీ, బిహార్, మధ్యప్రదేశ్‌లో పలుచోట్ల ముమ్మరంగా గాలించాయి. ఆ ఇంట్లో పనిచేసిన కల్పన రచించిన ప్రణాళికతోనే ఏడుగురు సభ్యుల ముఠా ఈ దోపిడీకి పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. అయితే కల్పన ముఠా పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు నుంచి రహస్య మార్గాల ద్వారా నేపాల్‌కు చేరినట్లు తెలిసిందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో కల్పనకు సహకరించిన దొంగల్లో ఒక్కడే పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా కల్పన ముఠాను పట్టుకునేందుకు ఆపరేషన్ నేపాల్ పేరుతో ప్రత్యేకబృం దాన్ని రంగంలోకి దింపినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. మాజీ డీజీపీ భార్యను హత్య చేసిన హంతకులను, దోపిడీదారులను ఎక్కడున్నా, గాలించి పట్టుకొని నగరానికి తీసుకొస్తామన్నారు. త్వరలోనే ఓ పోలీసు బృందం నేపాల్‌కు వెళుతుందని చెప్పారు. కాగా, సరిగ్గా ఏడాది క్రితం.. కాచిగూడ పరిధిలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ ముఠా.. రూ.5కోట్లతో ఉడాయించింది. ప్రత్యేక పోలీసు బృందాలు.. దొంగలకంటే ముందే విమానంలో డిల్లీ, నేపాల్ సరిహద్దుకు చేరుకొని నిఘా పెట్టినా దొంగ లు దొరకలేదు. రహస్య మార్గాల ద్వారా నేపాల్ చేరుకొని ఉంటారని భావించిన సీపీ.. దొంగల ముఠా నేపాల్‌లోని కైలాలీ జిల్లాకు చెందిన వారిగా గుర్తించి ఆపరేషన్ కైలాలీ పేరుతో ప్రత్యేక బృం దాన్ని ఆ దేశానికి పంపారు. అక్కడ వారి చిరునామాల్లో గాలించగా వారు భారత్ దాటి నేపాల్‌కు వెళ్లలేదని తేలింది. అయితే వారు భారత్‌లో ఎక్కడ తలదాచుకున్నారనేది ఇప్పటికీ తేలలేదు. చేసేది లేక పోలీసులు నేపాల్ దొంగల ముఠాకు చెందిన అనుమానితుల ఫొటోలను విడుదల చేసి, ఇండియా-నేపాల్ సరిహద్దులో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దొంగల ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వో, డీఐ నంబర్‌లతో పోస్టర్ విడుదల చేశారు.