తెలంగాణ నుంచి వెళ్లిన 22 మంది గల్లంతు!
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:37 AM
నేపాల్ జల విలయంలో తెలంగాణ నుంచి వెళ్లిన 22 మంది ఆచూకీ దొరకడం లేదని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. అందులో 17 మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు కాగా, ఆరుగురు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.
అందులో 17 మంది ఎన్నారైలు, ఐదుగురు హైదరాబాద్ వాసులు
(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్)
నేపాల్ జల విలయంలో తెలంగాణ నుంచి వెళ్లిన 22 మంది ఆచూకీ దొరకడం లేదని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. అందులో 17 మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు కాగా, ఆరుగురు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. వారంతా 26న ఆకస్మిక వరద ఘటనకు ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తర్వాతి నుంచి వారి జాడ తెలియకుండా పోయింది. దీనితో కుటుంబ సభ్యులు సచివాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఫోన్లు చేసి వివరాలు అందించారు. నేపాల్‌కు చెందిన క్లాసిక్ వెకేషన్స్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా భారత సంతతి అమెరికన్లు లక్ష్మీనాథ్ గోపిశెట్టి, సుధీంద్ర యాపలపర్వి, సుధీర్ రంగు, కేశవరావు తాడిపత్రి, వివేక్ శంకర్ శ్రీవాత్సవ, వెంకటరామన్ బాలసుబ్రమణ్యం, వెంకటకృష్ణ రఘునాథరావు, కీర్తి ఆచార్య ఒక బృందంగా నేపాల్ వెళ్లారు. వారు 26న ఉదయం 8.30 సమయంలో చివరగా ఫోన్ చేశారని, నేపాల్-చైనా సరిహద్దుల్లోని రసువాగఢీ ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉన్నామని చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఆచూకీ కోసం భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఇక హైదరాబాద్‌లోని మూసాపేట్ హబీబ్‌నగర్‌కు చెందిన అవ్వారి శ్రీధర్, అవ్వారి దీప్తి, అవ్వారి అభినవ్, ఆరుషి గుప్తా, మాదాపూర్‌కు చెందిన శివానందరెడ్డి సైతం నేపాల్‌లో జాడలేకుంటా పోయినట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇక మానస సరోవర్ యాత్రకు వెళ్లిన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌కు చెందిన కందిమల్ల సుహాసినిరెడ్డి (44) నేపాల్‌లో చిక్కుకున్నారు. ఆస్ట్రేలియాలో ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఓ శుభకార్యం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. ఈనెల 23న తన స్నేహితులతో కలిసి మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. మరోవైపు ఈషా ఫౌండేషన్ తరఫున వెళ్లిన భారత సంతతి అమెరికన్లు వందనా చంద్, శ్వేత పుట్టా, భారత సంతతి ఆస్ట్రేలియన్ అగస్త్య గోపీకృష్ణ నాయుడుతోపాటు ఎన్నారైలు వినయ్‌కుమార్‌రెడ్డి, వెన్నెలగంటి బాలసుబ్రమణ్యం, మహేంద్ర గుప్తా, గాయత్రి భరత్, నాగజ్యోతి లొల్ల తదితరుల ఆచూకీ తెలియడం లేదు.
మా కళ్ల ముందే జల ప్రళయం..
హైదరాబాద్ నుంచి వారం క్రితం సైన్‌ఇన్ ట్రావెల్స్ ద్వారా మానస సరోవర్ యాత్రకు బయలుదేరాం. నేపాల్‌లో ఆకస్మిక వరదల సమయంలో అక్కడే ఉన్నాం. ఒక టీస్టాల్ వద్ద పది నిమిషాల పాటు ఆగాం. ఫొటోలు దిగుతూ ఉన్నాం. అంతలోనే వరద ముంచుకొచ్చింది. మా కళ్లముందే భవనాలు కూలిపోయాయి. మా కంటే ముందు వెళ్లిన రెండు బస్సులు బ్రిడ్జితో సహా నీటిలో కొట్టుకుపోయాయి. ఆ దుర్ఘటనతో వెనక్కి తిరిగి ఖాఠ్మండుకు వచ్చాం.
- దాసరి శ్రీలక్ష్మీరెడ్డి, ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి
కేంద్ర మంత్రి మాట్లాడి ధైర్యం చెప్పారు..
మానస సరోవర్ యాత్రకు వెళ్లి టిబెట్‌లో చిక్కుకున్న మాతో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, చినజీయర్‌స్వామి, ఎంపీ కె.లక్ష్మణ్, గణపతి సచ్చిదానంద స్వామి వీడియో కాల్స్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. డీఆర్‌డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి సహా మా 31 మంది బృందంలో అందరం సురక్షితంగా ఉన్నాం. అత్యవసర మార్గం ద్వారా నేపాల్ వెళ్లాం. ఈనెల 30 నాటికి హైదరాబాద్‌కు చేరుకుంటాం.
- ఎంఎస్ రామారావు ట్రస్ట్ చైర్మన్ పోలాప్రగడ శ్రీనివాస్
అంతా భయానక వాతావరణం
నేపాల్- టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో వరద ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అక్కడ ఉన్న వారంతా భయపడుతున్నారు. వరద వచ్చిన రోజు మా ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దాంతో ప్రభుత్వం ఆచూకీ తెలియనవారి జాబితాలో నా పేరు కూడా పెట్టింది. ప్రమాదానికి ముందే మా బృందం ఆ ప్రాంతాన్ని దాటేసింది. ప్రస్తుతం టిబెట్‌లోని ‘సాగా’ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉన్నాం. ప్రత్యామ్నాయ మార్గంలో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- అల్లి ఐలేష్, రంగారెడ్డి జిల్లా చిలుకూరు