నోష్ ఫార్మా బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
ABN , Publish Date - May 07 , 2026 | 05:07 AM
నల్లగొండ జిల్లా వెలిమినేడులోని నోష్ ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటనలో గాయపడిన వారికి రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్
హైదరాబాద్, మే 6 (ఆంధ్ర జ్యోతి): నల్లగొండ జిల్లా వెలిమినేడులోని నోష్ ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటనలో గాయపడిన వారికి రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. డీఆర్‌డీఏ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబసభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందడంతో పాటు అనేక మంది గాయపడితే కార్మిక శాఖ మంత్రి పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. నోష్ ఫార్మా కంపెనీలో నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రమాదం జరగడం యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలశాఖ సమీక్ష చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.