Share News

kumaram bheem asifabad- లక్ష్యంపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Jun 03 , 2026 | 10:08 PM

గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ లక్ష్యంగా సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. పల్లెల అభ్యున్నతి కోసం అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో సేంద్రియ ఎరువులు తయారీ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టింది. పారిశుధ్య నిర్వహణతో పాటు సేంద్రియ ఎరువును సమకూర్చాలని ఒక్కో పంచాయతీకి సెగ్రిగేషన్‌ షెడ్డును అందుబాటులోకి తీసురావాలని సంకల్పించారు.

kumaram bheem asifabad- లక్ష్యంపై నిర్లక్ష్యం
లోగో

- వినియోగం లేక నిధులు వృథా

- సేంద్రియ ఎరువుల తయారీకి దూరం

ఆసిఫాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ లక్ష్యంగా సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించారు. పల్లెల అభ్యున్నతి కోసం అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో సేంద్రియ ఎరువులు తయారీ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టింది. పారిశుధ్య నిర్వహణతో పాటు సేంద్రియ ఎరువును సమకూర్చాలని ఒక్కో పంచాయతీకి సెగ్రిగేషన్‌ షెడ్డును అందుబాటులోకి తీసురావాలని సంకల్పించారు. ఈ మేరకు ఒక్కో షెడ్డుకు రూ.2.40లక్షలు మంజూరు చేసింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఇక్కడికి చేర్చి గాజు, ఇనుము, ప్లాస్టిక్‌ వంటి తదితర పొడి చెత్త వ్యర్థాలను వేరు చేసి గడులలో భద్రపరుస్తారు. తడి చెత్తను కుండీలలో వేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తారు. వీటి నిర్వహణ బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించారు. వీటి ద్వారా గ్రామాల్లో సేంద్రీయ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించాలి. కాగా ఆయా గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయినా సెగ్రిగేషన్‌ షెడ్లు అలంకారప్రాయంగా మారా యి. మరి కొన్ని చోట్ల షెడ్లలోని గడుల్లో తడి, పొడి చెత్తను వేసి అలాగే వదిలేశారు. దీంతో సపెగ్రిగేషన్‌ షెడ్ల పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతోంది. దీన్ని నివారించడానికి, సేంద్రీయ ఎరువు తయారు చేయడానికి నిర్మించిన షెడ్లు ఎక్కడా కూడా ఉపయోగంలోకి తేకుండా వదిలేశారు.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లా వ్యాప్తంగా 335పంచాయతీలకు షెడ్లు మంజూరయ్యాయి. ఇందులో 335షెడ్లు ఇప్పటికే పూర్తి చేశారు. గ్రామాల్లో సేంద్రీయ ఎరువుల తయారిపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. ప్రతి రోజు ఇళ్ల నుంచి సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి వాటిని అమ్మితే గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది. అలాగే మిగితా చెత్తను నాడెప్‌ వర్మి కంపోస్టు ట్యాంకులో వేసి ఎరువు తయారు చేసి విక్రయించడంతో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సేంద్రియ ఎరువుల తయారీకి అప్పట్లో వానపాములను కూడా సరఫరా చేసినా ఫలితం లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.

- అవగాహన లోపంతోనే..

గ్రామాల్లో పారిశుధ్య సిబ్బందికి, కార్యదర్శులకు సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన లేకపోవడంతోనే సెగ్రిగేషన్‌ షెడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అప్పట్లో వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ వర్మి కంపోస్టు తయారీ పద్ధతి తెలియకపోవడం, పంచాయతీల్లో సరిపడా సిబ్బంది, గ్రామాల్లో డంప్‌ యార్డులు లేకపోవడంతోనే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. సంబందిత అధికారులు పట్టించుకోని కారణంగా వృథాగా మారా యి. కొన్ని పంచాయతీల్లో మాత్రం షెడ్లను వినియోగించుకుంటూ సేంద్రియ ఎరువును తయారీ చేసి పంచాయతీకి ఆదాయం సమకూర్చుతున్నా పూర్తిస్థాయిలో తయారీ లేక లక్ష్యం నెరవేరడం లేదు.

- ఉపయోగంలోకి వచ్చేనా..

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి పెద్దగా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వీటి నిర్మాణంలో చూపిన శ్రద్ధ నిర్వహణలో చూపకపోవడంతో ఎరువుల తయారీకి అవకాశం ఉన్నా అందిపుచ్చుకోలేదు. అయితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎరువుల తయారీకి నోచుకోక మూలనపడ్డాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక వర్గాల పాలన కొనసా గుతోంది. పంచాయతీల్లో సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టి సారించాలని డిమాండ్‌ ఉంది. ఇక కొత్త పాలకవర్గాలు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి సేంద్రి య ఎరువులు తయారీ చేసి రైతులకు ఉపయో గపడేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - Jun 03 , 2026 | 10:08 PM