2 లక్షల్లోపు ర్యాంకు.. 420కిపైగా మార్కులొస్తేనే రాష్ట్రంలో మెడికల్ సీటు!
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:57 AM
వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష(నీట్)-2026 ఫలితాలు వెలువడటంతో విద్యార్ధులు తమకు వచ్చిన మార్కులు, ర్యాంకులతో సీటు ఎక్కడ వస్తుందా ? అని లెక్కలు వేసుకుంటున్నారు.
జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాపై నిపుణులు
అఖిల భారత కోటాకు తెలంగాణ నుంచి 660 సీట్లు
10 వేలలోపు ర్యాంకు సాధిస్తేనే ఆల్ ఇండియా కోటాలో..
నీట్‌లో మనోళ్లు సూపర్.. 99 పర్సంటైల్
సాధించిన 138 మందిలో 8 మంది తెలంగాణ వారే
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష(నీట్)-2026 ఫలితాలు వెలువడటంతో విద్యార్ధులు తమకు వచ్చిన మార్కులు, ర్యాంకులతో సీటు ఎక్కడ వస్తుందా ? అని లెక్కలు వేసుకుంటున్నారు. జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారం నుంచి అఖిల భారత కోటా సీట్లకు కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రాష్ట్రాల్లో ఉన్న సీట్లకు స్థానిక హెల్త్ యూనివర్శిటీల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అయితే, తెలంగాణ విద్యార్థులు నీట్ యూజీ 2026లో ఆల్ ఇండియా స్థాయిలో 2 లక్షల లోపు ర్యాంకు వస్తేనే రాష్ట్రంలో జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటా సీటు దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో అయితే 70-80 వేల మధ్య ఆల్ ఇండియా ర్యాంకు సాధించిన వారికే అక్కడ జనరల్ కేటగిరీలో సీటు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ నుంచి 65,121 మంది విద్యార్థులు నీట్ రీఎగ్జామ్‌కు హాజరవ్వగా వారిలో 38,026 మందే ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 36, ప్రైవేటులో 30, మరో 3 డీమ్డ్ యూనివర్శిటీలు, 4 మైనార్టీ వైద్య కళాశాలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 9,650 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. డిమ్డ్ వర్శిటీలను మినహాయిస్తే మిగిలిన అన్నింటికి కాళోజీ హెల్త్ యూనివర్శిటీనే కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో జనరల్ కేటగిరీలో సీటు దక్కాలంటే నీట్ ఆలిండియా ర్యాంకు కనీసం 2 లక్షల నుంచి 2.10 లక్షల మధ్య రావాలని నిపుణులు పేర్కొంటున్నారు. మార్కుల పరంగా అయితే 420కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకే జనరల్ కేటగిరిలో సీటు దక్కుతుందని అంటున్నారు.
జనరల్ కేటగిరీకి కన్వీనర్ కోటాలో సీటు వస్తే ప్రభుత్వ కాలేజీల్లో అయితే ఫీజు రూ.10 వేలు, ప్రైవేటులో అయితే రూ.60 వేలు ఉంటుంది. మేనేజ్‌మెంట్ కోటా (బీ కేటగిరీ) అయితే ఫీజు కాలేజీని బట్టి ఏడాదికి రూ.11.25 లక్షల నుంచి రూ.12.50 లక్షల మధ్య ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐ కోటా(సీ కేటగిరీ)లో ఫీజు దీనికి రెట్టింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కన్వీనర్ కోటా సీటు రావడం చాలా కష్టమని, ఆలిండియా ర్యాంకు 70-80 వేల లోపు వస్తేనే ఏపీలో కన్వీనర్ కోటా సీటు దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. మార్కుల పరంగా చూస్తే ఏపీ విద్యార్ధులు కనీసం 500 మార్కులుపైగా సాధిస్తేనే ఈ ఏడాది జనరల్ కేటగిరీలో సీటు దక్కించుకోగలుగుతారని అంటున్నారు. ఏపీలో సీట్లు తక్కువ, పోటీపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 4,400 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిలో 15 శాతం అంటే 660 సీట్లు అఖిల భారత కోటాకు వెళ్తాయి. ఆలిండియా కోటాలో సీటు దక్కాలంటే కనీసం 580-600 మధ్యలో స్కోర్ చేయాల్సి వుంటుందని నిపుణులు వెల్లడించారు. అంటే ఆలిండియా ర్యాంకు పదివేలు, ఆ లోపు వచ్చి ఉండాలని చెబుతున్నారు. 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఆలిండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్, జిప్‌మార్‌తో పాటు టాప్ డీమ్డ్ వర్శిటీల్లో సీటు దక్కుతుందని అంటున్నారు.
333మంది గురుకుల విద్యార్థులకు మెడికల్ సీట్లు!: మంత్రి అడ్లూరి
నీట్-2026 ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు సత్తా చాటాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సుమారు 333 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎ్‌సతో పాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.