Share News

మోదీ మౌనం వీడాలి!

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:21 AM

నీట్‌ పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ప్రజాసంఘాల ప్రతినిధులు, సామాజిక వేత్తలు డిమాండ్‌ చేశారు.

మోదీ మౌనం వీడాలి!

  • నీట్‌ లేకేజీపై విచారణ జరిపించాలి

  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి

  • ప్రజాసంఘాలు, ఏఐఎస్ఎఫ్‌ డిమాండ్‌

  • వాంగ్‌చుక్‌ పోరాటానికి సంఘీభావంగా నెక్లెస్ రోడ్డులో ప్రదర్శన

హైదరాబాద్‌ సిటీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): నీట్‌ పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ప్రజాసంఘాల ప్రతినిధులు, సామాజిక వేత్తలు డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రధాని మోదీ మౌనం వీడాలన్నారు. ఢిల్లీలో 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌కు మద్దతుగా గురువారం నెక్లెస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రగతిశీల, అభ్యుదయ, ప్రజాస్వామిక వాదులు దీపాల ప్రదర్శన నిర్వహించారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాంగ్‌చుక్‌ డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా కమిషన్‌ మాజీ అధ్యక్షుడు ఆకునూరి మురళీ, సీనియర్‌ ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, సోషల్‌ డెమొక్రటిక్‌ ఫోరం కన్వీనర్‌ ఆంజనేయులు, ప్రొఫెసర్‌ కె. లక్ష్మీనారాయణ, పద్మజా షా, పీవోడబ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే..

నీట్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణం రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్‌ సిరంగరాజ్‌, జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్‌.ఎ. స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పేదలను విద్యకు దూరం చేసేలా ఉన్నాయని విమర్శించారు. స్టాలిన్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా నేటికీ విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం బాధాకరమన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 06:22 AM