మా అమ్మాయిని తెచ్చివ్వలేరు కదా!
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:59 AM
విద్యార్థుల రాజీ లేని పోరాటానికి కేంద్రం తలవంచి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించడం మంచి పరిణామమని, కానీ.. ఎవరేం చేసినా తమ అమ్మాయిని మాత్రం తెచ్చివ్వలేరని హైదరాబాద్‌కు చెందిన నీట్ విద్యార్థిని..
మళ్లీ ఇలాంటి తప్పులు జరగవని ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలి
మా కష్టం ఎవరికీ రాకూడదనే ఉద్యమంలో పాల్గొన్నాం
ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థిని సనా తల్లిదండ్రులు
హైదరాబాద్ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల రాజీ లేని పోరాటానికి కేంద్రం తలవంచి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించడం మంచి పరిణామమని, కానీ.. ఎవరేం చేసినా తమ అమ్మాయిని మాత్రం తెచ్చివ్వలేరని హైదరాబాద్‌కు చెందిన నీట్ విద్యార్థిని షేక్ సనా తల్లిద్రండులు షేక్ జాఫర్ హుస్సేన్, షేక్ హాబీబున్నీసా ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్రపత్న్రం లీక్ తర్వాత పరీక్ష రద్దు కావడంతో తీవ్ర నిరాశకు గురైన షేక్ సనా.. గతనెల 20న ఆత్మహత్య చేసుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో షేక్ సనా తల్లిదండ్రులను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకోవడం లేదని వారు చెప్పారు. డాక్టర్ అవ్వాలని కలలుగన్న తమ కూతురిని ఈ వ్యవస్థలోని అవినీతి పొట్టన పెట్టుకుందని ధ్వజమెత్తారు. తమకు వచ్చిన కష్టం మరెవ్వరికి రాకూడదని కన్నీటి పర్యంతమయ్యారు. అందుకే పట్టరాని దుఃఖంలో ఉండి కూడా జంతర్ మంతర్ వెళ్లి విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం తెలిపామని చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాకుడు అభిజిత్‌తోపాటు సౌరబ్ దాస్, అశుతోష్ ఇతర ప్రతినిధులతో మాట్లాడ డం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఉద్య మానికి మద్దతుగా వారం రోజులు ఢిల్లీలోనే ఉండి తాము కూడా నిరసన తెలిపినట్లు చెప్పారు. ‘‘మా సొంత ఊరు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు.
గత ఏడాది నీట్‌లో ఆశించిన ఫలితం రాకపోవడంతో షేక్ సనా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. మేలో జరిగిన నీట్ పరీక్ష చాలా బాగా రాశానని చెప్పింది. మంచి కాలేజీలో సీటు వస్తుందని ఆశించాం. ప్రశ్నపత్రం లీకేజీతో నీట్ రద్దు కావడంతో సనా తల్లడిల్లిపోయింది. ఏడాది పాటు చదివిన సిలబస్‌ను తిరిగి నెలలో రివిజన్ చేయగలనా? అని బాధపడి ఏడ్చింది. ఇంటిల్లిపాది ఓదార్చాం. అంతలోనే గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. ఎవరో చేసిన తప్పులకు మాకు జీవితకాల శోకం మిగిలింది’’ అని చెబుతూ వారు కన్నీటి పర్యంతమయ్యా రు. విద్యాశాఖ మంత్రి మారినంత మాత్రాన ఇలాంటి అక్రమాలు మళ్లీ జరగవని నమ్మకం ఏంటని నిలదీ శారు. ఇకపై ప్రశ్న పతాల్ర లీకేజీలు, మూల్యంకనంలో లోపాలు, అవినీతి వంటివి చోటుచేసుకోనివ్వమని ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
ఇదంతా వారి కోసమే: అభిజీత్ దీప్కే
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే ఢిల్లీలో ని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న వేదికపై నుంచి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న షేక్ సనా సహా 20 మంది విద్యార్థుల చిత్రాలను ప్రదర్శించారు. ఆ విద్యార్థుల పేర్లు చదివి వినిపించిన అభిజీత్ దీప్కే.. తాము చేపట్టిన ఉద్యమం, సాధించిన ఈ విజయం ఆ విద్యార్థుల కోసమేనని పేర్కొన్నారు.