డబుల్ ఇంజన్ సర్కార్ అంటే పేపర్ల లీకేజీయేనా?
ABN , Publish Date - May 14 , 2026 | 04:13 AM
డబుల్ ఇంజన్‌సర్కార్ అంటే నిరుద్యోగుల గొంతుకోయడమేనా? పరీక్ష పేపర్ల లీకేజీలేనా? కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన అసమర్థతతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థుల...
కేంద్రం అసమర్థతకు నీట్ కుంభకోణమే నిదర్శనం: మంత్రి పొంగులేటి
లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి: కాంగ్రెస్
కూసుమంచి/హైదరాబాద్/చిక్కడపల్లి/ఖైరతాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): ‘‘డబుల్ ఇంజన్‌సర్కార్ అంటే నిరుద్యోగుల గొంతుకోయడమేనా? పరీక్ష పేపర్ల లీకేజీలేనా? కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన అసమర్థతతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీయే ఇందుకు నిదర్శనం’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నీట్ నిర్వహణకు 42 గంటలముందే ప్రశ్నపత్రాలు బయటకు రావడం దేశవ్యాప్తంగా 23 లక్షలమంది, తెలంగాణలో 70వేల మంది విద్యార్థులు రోడ్డునపడ్డారని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపైన సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఏ ఫహీం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణకు వీలుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ రాజీనామా చేయాలని, లీకేజీకి బాధ్యులైన ఎన్‌టీఏ చైర్మన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. గాంధీభవన్‌లో ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామితో కలిసి పేపర్ చోర్, గద్దె చోడ్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.
నీట్ నిర్వహణలో మోదీ సర్కార్ విఫలం: ఎస్‌ఎఫ్ఐ
నీట్‌ను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎస్‌ఎఫ్ఐ నేతలు టి. నాగరాజు, ఎండీ అతిక్ అహ్మద్ ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద విద్యార్థులు ఉరి వేసుకుంటున్నట్లుగా వినూత్నంగా నిరసన చేపట్టారు.
బీఆర్‌ఎ్‌సవీ ఆధ్వర్యంలో లోక్‌భవన్ వద్ద ఆందోళన
నీట్‌ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో లోక్‌భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని అరెస్టు చేశారు. ఆందోళనకారులు లోక్‌భవన్ గేట్లు ఎక్కి లోనికి దూకే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.