Share News

నీట్‌ కఠినం

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:07 AM

ఉద్విగ్నభరిత వాతావరణం మధ్య నీట్‌-2026 పునః పరీక్ష పూర్తయింది. దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలలో పరీక్ష కోసం 22.74 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకోగా, 19.95 లక్షల మంది పరీక్ష రాసినట్టు ఎన్‌టీఏ తెలిపింది.

నీట్‌ కఠినం

  • బెంబేలెత్తించిన ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రశ్నలు

  • కాస్త సులువుగా వృక్ష, జంతుశాస్త్రాలు

  • ఈసారి కటాఫ్‌ తగ్గిపోవచ్చన్న నిపుణులు

  • 430-450 స్కోర్‌ చేస్తే తెలంగాణలో కన్వీనర్‌ కోటా సీటు రావొచ్చని అంచనా

  • దేశవ్యాప్తంగా హాజరైన 20 లక్షల మంది

  • తెలంగాణలో 89.09 శాతం హాజరు

  • నిమిషం ఆలస్యమైనా అనుమతించని అధికారులు.. విద్యార్థుల కన్నీళ్లు

  • కాన్వాయ్‌తో అభ్యర్థులకు ఇబ్బందికావొద్దని 45నిమిషాలు ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే మోదీ

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి)/న్యూఢిల్లీ): ఉద్విగ్నభరిత వాతావరణం మధ్య నీట్‌-2026 పునః పరీక్ష పూర్తయింది. దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలలో పరీక్ష కోసం 22.74 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకోగా, 19.95 లక్షల మంది పరీక్ష రాసినట్టు ఎన్‌టీఏ తెలిపింది. తెలంగాణలోని 208 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష కోసం 73,059 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 65,087 మంది (89.09 శాతం) హాజరయ్యారు. పరీక్ష కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు.. నిర్ధారిత సమయం తర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. గూగుల్‌ మ్యాప్స్‌లో లొకేషన్‌ తప్పుగా చూపించడం, ట్రాఫిక్‌ జామ్‌లు, హాల్‌టికెట్లలో పేర్కొన్న వివరాల్లో గందరగోళం వంటి కారణాలతో వేలాది మంది అభ్యర్థులు సమయానికల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. ఆలస్యంగా వచ్చినవారిని లోనికి అనుమతించకపోవడంతో పలుచోట్ల అభ్యర్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బతిమాలారు. చివరికి కన్నీళ్లతో వెనుదిరిగారు. మరోవైపు నీట్‌ పరీక్ష రాసి బయటికి వచ్చిన విద్యార్థుల్లోనూ కొంత ఆందోళన కనిపించింది. పరీక్షలు సుదీర్ఘంగా, కఠినంగా వచ్చాయని అభ్యర్థులు పేర్కొన్నారు. రద్దయిన నీట్‌ను చాలా బాగా రాశామని, కానీ ఇప్పుడు కఠినంగా రావడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు.

అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు..

మే 3 జరిగిన నీట్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో అదే నెల 12న పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. తిరిగి ఆదివారం (ఈ నెల 21న) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్షను తిరిగి నిర్వహించింది. పరీక్ష లీకేజీతో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన, మళ్లీ అలాంటి ఘటన జరిగితే ఎలాగన్న సందేహాల నేపథ్యంలో.. నీట్‌ పునః పరీక్షకు కేంద్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 551 పట్టణాల్లోని 5,440 సెంటర్ల వద్ద గట్టి భద్రత కల్పించింది. పరీక్షలు జరిగిన సుమారు 95 వేల గదులు, పరీక్షా కేంద్రం ఆవరణల్లో కలిపి మ్తొంగా 1.38 లక్షల సీసీ కెమెరాలు, 51,311 సిగ్నల్‌ జామర్లను ఏర్పాటు చేసింది. పరీక్ష జరుగుతున్న తీరును కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో ఉన్న ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించారు. గుజరాత్‌లో నీట్‌ పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా పెట్టారు. నీట్‌ పునః పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేశాయని.. అధికారులు, సిబ్బంది, పోలీసులు కలిపి సుమారు 7 లక్షల మంది విధులు నిర్వర్తించారని ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌ తెలిపారు.

7.jpg


ఐసీయూ నుంచి వచ్చి పరీక్ష..

  • కోల్‌కతాలో వారం క్రితం సృష్టి దూబే అనే యువతి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పక్కటెముకలు, ఊపిరితిత్తులకు శస్త్రచికిత్సలు జరిగాయి. వేగంగా కోలుకున్న ఆమె నీట్‌ పరీక్ష రాస్తానని కోరింది. దీనిపై సృష్టి తండ్రి విజ్ఞప్తి మేరకు ఎన్‌టీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రంలో ప్రత్యేక గదిలో వైద్య సహాయం పొందుతూనే సృష్టి పరీక్ష రాశారు.

  • అహ్మదాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద హిందూ, ముస్లిం అభ్యర్థులను లోనికి అనుమతించే అంశంపై వివాదం నెలకొంది. హిందూ అభ్యర్థులను పవిత్రమైన దారాలు, ఆభరణాలను తొలగించాకే లోనికి పంపుతున్న అధికారులు.. మరోవర్గం వారు బుర్ఖా, హిజబ్‌ ధరించినా లోనికి పంపడం ఏమిటని పలువురు హిందూ సంఘాల నేతలు, అభ్యర్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ఎంఐఎం పార్టీ నేతలూ అక్కడికి చేరుకున్నారు. దీనితో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, అధికారులు వారికి నచ్చజెప్పి పంపేశారు.

  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ విద్యార్థి తన మేనమామతో కలిసి పరీక్షా కేంద్రానికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన విద్యార్థికి ప్రథమ చికిత్స చేసి హడావుడిగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లినా.. అప్పటికే సమయం ముగియడంతో లోనికి అనుమతించలేదు.

  • సంగారెడ్డి జిల్లా తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని పరీక్షా కేంద్రంలో అమెరికా నుంచి వచ్చిన హిమనీష్‌ పరీక్ష రాశారు.

45 నిమిషాలు వేచి ఉన్న మోదీ

కోల్‌కతా పర్యటనకు వెళ్లిన మోదీ తిరిగివస్తూ.. ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ వెంటనే తన నివాసానికి బయల్దేరలేదు. ఆ సమయంలో తాను కాన్వాయ్‌తో బయటికి వెళితే రోడ్లపై ట్రాఫిక్‌ నిలిచిపోయి.. నీట్‌ పరీక్ష కోసం వెళ్లేవారికి ఇబ్బంది అవుతుందని భావించారు. సుమారు 45 నిమిషాలు విమానాశ్రయంలోనే వేచిఉండి.. తర్వాత బయలుదేరారు.


అబుధాబి కేంద్రం ఎంపికైనది అభ్యర్థి లాగిన్‌ నుంచే!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అభ్యర్థికి అబుధాబిలో నీట్‌ పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన అంశంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్‌టీఏ వివరణ ఇచ్చింది. విదేశాల్లో ఉన్న భారతీయ అభ్యర్థులు నీట్‌ రాసేందుకు వీలుగా పలు దేశాల్లో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. నీట్‌ పరీక్ష రద్దు తర్వాత పునః పరీక్ష కోసం తగిన పట్టణాన్ని ఎంపిక చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చామని.. ఆ సమయంలో సదరు అభ్యర్థికి చెందిన లాగిన్‌ నుంచే అబుధాబి పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసినట్టు గుర్తించామని వెల్లడించింది. పరీక్షకు రెండు రోజుల ముందు పరీక్షా కేంద్రాన్ని నాగ్‌పూర్‌కు మార్చాలంటూ విజ్ఞప్తి రాగా.. సానుకూల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

430-450 స్కోర్‌ చేస్తే తెలంగాణలో కన్వీనర్‌ కోటా సీటు!

నీట్‌ పునః పరీక్ష ప్రశ్నపత్రం కాస్త కఠినంగా వచ్చింది. మొత్తం 180 ప్రశ్నల్లో సగం సాధారణంగా ఉంటే, మరోసగం చాలా కఠినంగా వచ్చాయని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు. వృక్ష, జంతుశాస్త్రాలకు సంబంధించిన 90 ప్రశ్నల్లో ఐదారు మినహా మిగతావి తేలికగానే ఉన్నాయని చెప్పారు. మే 3న నిర్వహించిన పరీక్షతో పొల్చినా సులువుగానే ఉన్నాయని.. మెరిట్‌ విద్యార్థులు దాదాపు అన్నింటికీ జవాబు ఇవ్వగలరని వివరించారు. ఇక భౌతిక శాస్త్రం (ఫిజిక్స్‌) ప్రశ్నలు మాత్రం అత్యంత కఠినంగా ఉన్నాయని.. కొన్ని మెరిట్‌ విద్యార్థులు కూడా జవాబు రాయలేని స్థాయిలో ఉన్నాయని తెలిపారు. సాధారణ విద్యార్థులు సగం ప్రశ్నలకే జవాబు ఇవ్వగలరని వెల్లడించారు. ఇక రసాయన శాస్త్రం ప్రశ్నలు కూడా మే3 నాటి పరీక్షతో పోలిస్తే చాలా క్లిష్టంగా ఉన్నాయని తెలిపారు. 6-7 ప్రశ్నలైతే సుదీర్ఘంగా, తికమకకు గురయ్యేలా ఉన్నాయని చెప్పారు. ఒకట్రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవని, వాటికి బోనస్‌ మార్కులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. మొత్తంగా నీట్‌ కఠినంగా ఉన్న నేపథ్యంలో ఈసారి కటాఫ్‌ తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేశారు. 430-450 మధ్య స్కోర్‌ చేసిన వారికి తెలంగాణలో కన్వీనర్‌ కోటా సీటు దక్కే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.


8.jpg

చిరునామా.. హైరానా

నీట్‌ హాల్‌టికెట్లలో పరీక్ష కేంద్రం చిరునామాలు హైరానాకు దారితీశాయి. విజయవాడ రహదారివైపు ఉన్న హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతంలోని హయత్‌నగర్‌ మధ్య అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. దీనితో పలువురు పరీక్ష రాయలేకపోయారు. నల్గొండకు చెందిన స్పందన హాల్‌టికెట్‌పై పరీక్షా కేంద్రం చిరునామా ‘ప్రభుత్వ హైస్కూల్‌, మాణిక్యమ్మ కాలనీ, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌’ అని ఉండటంతో ఆమె విజయవాడ రోడ్డులోని హయత్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల వద్దకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రం వద్ద సిబ్బంది హాల్‌టికెట్‌ను పరిశీలించి.. రాజేంద్రనగర్‌కు వెళ్లాలని చెప్పారు. ఆమె హడావుడిగా బయలుదేరినా రాజేంద్రనగర్‌కు చేరుకోవడానికి గంటకుపైగా సమయం పట్టింది. అప్పటికే సమయం మించిపోవడంతో పరీక్షకు అనుమతించలేదు. రాజేంద్రనగర్‌లోని సాహెబ్‌నగర్‌లో ఉన్న మరో పరీక్షా కేంద్రం చిరునామాలోనూ ఇలాగే శివరాంపల్లి, హయత్‌నగర్‌, రంగారెడ్డి అని ఉంది. దీనితో ఈ రెండు పరీక్షా కేంద్రాలకు రావాల్సిన సుమారు 40 మంది విద్యార్థులు.. హయత్‌నగర్‌కు వెళ్లి, అక్కడి నుంచి రాజేంద్రనగర్‌కు వచ్చారు. కొందరు సమయానికి చేరుకోగా, మరికొందరికి ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేక కన్నీళ్లతో వెనుదిరిగారు. అధికారుల నిర్లక్ష్యంతో తమ భవిష్యత్తుపై దెబ్బపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్‌లోని టోలిచౌకికి చెందిన హసన్‌హాష్మి అనే విద్యార్థికి బొల్లారం కేంద్రీయ విద్యాలయలో సెంటర్‌ కేటాయించగా.. సరైన అవగాహన లేక తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయకు వచ్చారు. పొరపాటును గుర్తించి ఆందోళన పడ్డారు. సమయం తక్కువగా ఉండటంతో బొల్లారం ఏసీపీ రమేశ్‌కుమార్‌.. రాష్ట్రపతి నిలయం గేటు తెరిపించి మరీ పోలీసు వాహనంలో షార్ట్‌కట్‌లో బొల్లారం సెంటర్‌కు తీసుకెళ్లారు.

ముందే ప్లాన్‌ చేసి.. బాత్రూమ్‌లో ఫోన్‌ దాచి..

రంగారెడ్డి జిల్లాలో రాగన్నగూడ జెడ్పీ హైస్కూల్‌లో పరీక్షా కేంద్రం వచ్చిన అచ్చంపేట విద్యార్థి నరేందర్‌ తెలివిగా కాపీ కొట్టేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. పరీక్షా కేంద్రం వివరాలు తెలుసుకున్న విద్యార్థి ఉదయమే స్కూల్‌ వద్దకు వచ్చాడు. తన ఫోన్‌ను నీటిలో వేసినా తడవని విధంగా జిప్‌లాక్‌ కవర్‌లో ఉంచి.. ప్రహరీకి ఆనుకొని ఉన్న బాత్రూమ్‌ వెంటిలేటర్‌లో పెట్టాడు. మెయిన్‌ గేట్‌ నుంచి తనిఖీలు పూర్తి చేసుకొని పరీక్ష కేంద్రంలోకి వెళ్లాడు. కాసేపటికి బాత్రూమ్‌లోకి వెళ్లి ఫోన్‌ను ఫ్లష్‌ ట్యాంకులో దాచాడు. ఉదయం 11 గంటల సమయంలో బాత్రూముల వద్ద సిబ్బంది తనిఖీలు చేసినా ఫోన్‌ను గుర్తించలేకపోయారు. పరీక్ష ప్రారంభమయ్యాక.. నరేందర్‌ కడుపులో నొప్పిగా ఉందంటూ బాత్రూమ్‌కు వెళ్లాడు. చాలాసేపటి వరకు రాకపోవడంతో ఇన్విజిలేటర్‌ సందేహంతో భద్రతా సిబ్బందికి చెప్పారు. వారు బాత్రూమ్‌ వద్దకు వెళ్లి గూగుల్‌లో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న నరేందర్‌ను పట్టుకున్నారు.

Updated Date - Jun 22 , 2026 | 05:07 AM