Share News

ఈసారి సులువుగా నీట్‌..!

ABN , Publish Date - May 04 , 2026 | 05:00 AM

దేశంలోని వైద్యకళాశాల్లో ఎంబీబీఎస్‌, డెంటిస్ట్రీ తదితర కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ-2026 ప్రశ్నపత్రం మోడరేట్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఈసారి సులువుగా నీట్‌..!

  • జీవశాస్త్రంలో అత్యధిక మార్కులు వచ్చే అవకాశం.. రసాయన శాస్త్రంలో ఐదారు ప్రశ్నలే కఠినం

  • మధ్యస్తంగా భౌతిక శాస్త్రం ప్రశ్నలు

  • రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన పరీక్ష

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): దేశంలోని వైద్యకళాశాల్లో ఎంబీబీఎస్‌, డెంటిస్ట్రీ తదితర కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ-2026 ప్రశ్నపత్రం మోడరేట్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. సాపేక్షంగా బయాలజీ సులువుగా ఉంది. చాలావరకు ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి అడిగారు. ఎక్కువ ప్రశ్నలు స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఇవ్వడంతో బయాలజీలో సమాధానాలు గుర్తించేందుకు గంటసేపు పట్టింది. రసాయన శాస్త్రంలో అడిగిన ప్రశ్నల నిడివి ఎక్కువ కాగా వాటి స్థాయి ప్రామాణికంగా ఉంది. ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీల మధ్య సమతుల్యత పాటించారు. ఫిజిక్స్‌ మోడరేట్‌ నుంచి కష్టంగా ఉంది. స్టేట్‌మెంట్‌లు, డయాగ్రమ్‌ల ఆధారంగా ప్రశ్నలు ఉన్నాయి. కాలిక్యులేషన్స్‌ ఎక్కువ. కాగా, రాష్ట్రంలో నీట్‌ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ నుంచి మొత్తం 73,024 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 71,304మంది (97.64శాతం) పరీక్షకు హాజరయ్యారని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,720 మంది గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యం నిబంధనను అమలు చేయడంతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. కన్నీరు పెట్టుకుంటూ నిరాశగా వెనుదిరిగారు. కాగా, విద్యార్థుల అంచనాలను తలకిందులు చేస్తూ ప్రశ్నపత్రం ఈసారి చాలా సులువుగా ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబ్‌సలోని ప్రశ్నలనే ఎక్కువగా ఇచ్చారని చెబుతున్నారు. గతేడాది భౌతిక శాస్త్రం ప్రశ్నలు విద్యార్థులను బెంబేలెత్తించాయి. 12-15 ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమే విద్యార్థులకు కష్టమైంది. ఈసారి భౌతికశాస్త్రం విభాగంలో 25-30 ప్రశ్నలకు సగటు విద్యార్థి కూడా సరైన జవాబులిచ్చేలా ప్రశ్నపత్రం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఓ 4-5 ప్రశ్నలు మాత్రం విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇక, రసాయన శాస్త్రంలో ఐదారు ప్రశ్నలే ట్రిక్కీగా ఇవ్వగా.. విద్యార్థులు వీటిలో తప్పులు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జీవశాస్త్రంలో అన్నీ తేలిగ్గానే ఇచ్చినట్లు విద్యార్థులు చెప్పారు. బయాలజీలో 360 మార్కులకుగాను ఈసారి మెజార్టీ విద్యార్థులు 350 వరకు మార్కులు సాధించే అవకాశం ఉంటుందని నిపుణులు వెల్లడించారు. మొత్తమ్మీద పేపర్‌ నిడివి ఎక్కువ, ట్రికీ కాలిక్యులేషన్స్‌ కారణంగా కటాఫ్‌ పది నుంచి పదిహేను మార్కులు పెరగవచ్చని హైదరాబాద్‌లోని ఎక్స్‌లెన్సియాకు చెందిన పవన్‌ కుమార్‌ వెల్లడించారు.


జనరల్‌లో 460-480 స్కోర్‌ చేస్తే సీటు గ్యారంటీ!

తెలంగాణలో 8,500 వరకు ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. కన్వీనర్‌ కోటాలో సీటు దక్కాలంటే జనరల్‌ కేటగిరి విద్యార్థులు ఈసారి కనీసం 460-480 మార్కులకు పైగా స్కోర్‌ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది జనరల్‌ కేటగిరిలో 405 స్కోర్‌ చేసిన వారికి తెలంగాణలో కన్వీనర్‌ కోటాలో సీటు దక్కింది. రిజర్వేషన్‌ కోటా400 పైచిలుకు మార్కులు వచ్చిన వారికి ఏ కేటగిరిలో సీటు వచ్చింది. ఈ ఏడాది ప్రశ్నపత్రం సులువుగా ఉండడంతో విద్యార్థులకు వచ్చే మార్కులు భారీగా పెరిగే అవకాశముంది. గత ఏడాది జనరల్‌ కేటగిరిలో నీట్‌ కటాఫ్‌ మార్కులు 144 ఉండగా, ఈసారి అది 150-160 మధ్యలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

నెలాఖరుకు కీ, జూన్‌లో ఫలితాలు

నీట్‌-2026 ఫలితాలు జూన్‌ రెండో వారంలో వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్టీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలఖారులోగా కీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 820కి పైగా ఉన్న వైద్య కళాశాలలో 1.29 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 22.79 లక్షల మందికిపైగా నీట్‌-2026 పరీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో సీటుకు సగటున 1,718 మంది పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4,390 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ప్రైవేటులోనూ కలిపితే ఆ సంఖ్య 8,500 వరకు ఉంది.

460 స్కోర్‌ చేస్తే కన్వీనర్‌ కోటా సీటు

ఈసారి పేపర్‌ చాలా తేలిగ్గా రావడంతో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 685 మార్కులు స్కోర్‌ చేస్తే ఆలిండియా స్థాయిలో వెయ్యిలోపు ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో 460-480 మార్కులు సాధించే జనరల్‌ కేటగిరి విద్యార్థులకు కన్వీనర్‌ కోటాలో సీటు వస్తుంది. అదే ఏపీలో అయితే 570 వరకు స్కోర్‌ చేయాల్సి ఉంటుంది.

- డి. శంకర్‌రావు, డీన్‌, శ్రీచైతన్య కాలేజీ, కూకట్‌పల్లి

Updated Date - May 04 , 2026 | 05:00 AM