చేరే ముందే చెక్ చేసుకోండి.. నీట్ ఉత్తీర్ణులకు నిపుణుల సూచనలు
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:07 AM
రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. నీట్-2026లో ఉత్తీర్ణులైన రాష్ట్ర విద్యార్థులు బుధవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
సీటు వచ్చే అవకాశమున్న కాలేజీకి వెళ్లి తనిఖీ చేసుకుంటే మంచిది..
ఫ్యాకల్టీ, సదుపాయాలపై ఆరా తప్పనిసరి
కాలేజీ ప్రాధాన్యత క్రమం గుర్తుపెట్టుకుని.. వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా ఇవ్వాలి
నీట్ ఉత్తీర్ణులకు నిపుణుల సూచనలు
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. నీట్-2026లో ఉత్తీర్ణులైన రాష్ట్ర విద్యార్థులు బుధవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ నెల 12 నాటికి రిజిస్ట్రేషన్లు ముగుస్తాయని, అనంతరం కన్వీనర్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపింది. అయితే వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ నుంచి కాలేజీల ఆప్షన్స్ ఎంచుకునే వరకు విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యవిద్య నిపుణులు సూచిస్తున్నారు. ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో పరిశీలించాలని.. సదరు కాలేజీకి వెళ్లి ఫ్యాకల్టీ, సదుపాయాల గురించి ఆరా తీయాలని చెబుతున్నారు.
అన్ని కాలేజీలకు ఆప్షన్లు..
చాలామంది విద్యార్థులు కొన్ని కాలేజీలకే ఆప్షన్స్ పెట్టుకుంటుంటారని, అది సరికాదని నిపుణులు చెబుతున్నారు. తమ ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో.. గతేడాది ర్యాంకులు, కాలేజీల కేటాయింపులను ఒకసారి పరిశీలించాలని సూచిస్తున్నారు. పదిశాతం అటు ఇటుగా ర్యాంకుల ఆధారంగా దాదాపు అవే కాలేజీల్లో ఈ ఏడాది సీట్లు దక్కే అవకాశాలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. విద్యార్థులు రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలకు ఆప్షన్లు పెట్టుకుంటే మంచిదని స్పష్టం చేస్తున్నారు. కొన్నిసార్లు గాంధీ, ఉస్మానియా, కాకతీయ వంటి ప్రతిష్ఠాత్మక మెడికల్ కాలేజీల్లోనూ సీటు దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆధ్వర్యంలో 36, ప్రైవేటులో 30, 4 మైనార్టీ వైద్య కళాశాలలు, 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలను మినహాయిస్తే.. ప్రైవేటు వైద్యవిద్య కాలేజీల్లో 5,210, సర్కారీ కాలేజీల్లో 4,440.. కలిపి మొత్తం 9,650 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇందులో 666 సీట్లు ఆలిండియా కోటాకు వెళ్తాయి. ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 50శాతం కన్వీనర్ కోటాకు వస్తాయి. అంటే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలసి 6,379 కన్వీనర్ కోటా సీట్లుంటాయి.
ఆలిండియా కోటా సీట్లకు దరఖాస్తు చేయాలి
మెరిట్ విద్యార్థులు తప్పనిసరిగా ఆలిండియా కోటాకు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఇష్టం లేకపోతే ఆలిండియా కోటాలో రాష్ట్ర కాలేజీలనే ఆప్షన్స్‌గా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో రాష్ట్రంలోని 666 ఆలిండియా కోటా సీట్లలో సీటు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఆలిండియా కోటాకు రాష్ట్రవిద్యార్థులు పెద్దగా దరఖాస్తు చేయకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వ వైద్య కాలేజీల్లోని ఆలిండియా సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు దక్కుతున్నాయని చెబుతున్నారు.
గతేడాది ఏ ర్యాంకుకు ఎక్కడ సీట్లు వచ్చాయంటే..
గతేడాది గాంధీ మెడికల్ కాలేజీలో నీట్ ఆలిండియా ర్యాంకు 14,005 వరకు ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చింది. ఎస్టీ కేటగిరీలో 1,05,661 ర్యాంకు వరకు సీటు లభించింది. ఉస్మానియాలో 20,152 (మార్కులు 535)వరకు ఓపెన్ కేటగిరీ, ఎస్టీ కేటగిరీలో 1,10,282 ర్యాంకు (457 మార్కులు) వరకు సీటు దక్కింది. వరంగల్ కాకతీయలో 34,949 ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చింది. అపోలో మెడికల్ కాలేజీలో 41,663 ర్యాంకు.. నోవా మెడికల్ కాలేజీలో 2,04,771ర్యాంకు (403 మార్కులు) వరకు కన్వీనర్ కోటా సీట్లు లభించాయి. గతేడాది ఆయా కాలేజీల్లో ఏయే ర్యాంకు వరకు కన్వీనర్ కోటా సీటు లభించిందనే వివరాలను ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో పొందవచ్చు.



