ఎన్‌డీడీబీ చేతికి మదర్ డెయిరీ
ABN , Publish Date - May 13 , 2026 | 04:01 AM
అప్పుల ఊబిలో కూరుకుపోయిన నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ...
యాదాద్రి/హయత్‌నగర్, మే 12(ఆంధ్రజ్యోతి): అప్పుల ఊబిలో కూరుకుపోయిన నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్ముల్-మదర్ డెయిరీ) నిర్వహణను జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ) పర్యవేక్షించనుంది. నార్ముల్‌ను ఎన్‌డీడీబీకి అప్పగించేందుకు ఒప్పంద పత్రాలపై ఇరు సంస్థల ఉన్నతాధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సమక్షంలో సంతకాలు చేశారు. రైతులకు చెల్లించాల్సిన పాల బిల్లుల బకాయిల చెల్లింపుల కోసం రూ.10 కోట్ల చెక్కును ఎన్‌డీడీబీ అధికారులు నార్ముల్‌కు అందజేశారు. నార్ముల్ చెల్లించాల్సిన బకాయిలు, అప్పులు రూ.70 కోట్లు వరకు ఉన్నాయి. చిట్యాల సమీపంలోని భూమిని ఎన్‌డీడీబీకి రూ.42 కోట్లకు విక్రయించగా, మరో రూ.28 కోట్లను ఎన్‌డీడీబీ అప్పులు, గ్రాంటు రూపేణా నార్ముల్‌కు అందజేసేలా ఒప్పందం కుదిరింది. ఇక నార్ముల్ ప్లాంటు, పాలు, పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలను ఎన్‌డీడీబీ నిర్వహిస్తుంది. ఈ ఒప్పందంతో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 50వేల మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అయిలయ్య ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.