ఎన్‌సీఎల్‌టీలో నకిలీ పత్రాలతో అనన్య ఇన్‌ఫ్రా కంపెనీని స్వాధీనం చేసుకున్నారు
ABN , Publish Date - May 28 , 2026 | 03:08 AM
నేషనల్ కంపెనీ లా టైబ్ర్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో నకిలీ పత్రాలు, ఫోర్జరీ చెక్కులు, తప్పుడు క్లెయిమ్‌లు సమర్పించి తన రియల్ ఎస్టేట్ కంపెనీని ..
సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీస్ స్టేషన్‌లో సంస్థ ప్రమోటర్ రాజ్‌కుమార్ రాయ్ ఫిర్యాదు
తనకు రూ.200 కోట్ల మేర నష్టం జరిగిందని వెల్లడి
హైదరాబాద్ సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి): నేషనల్ కంపెనీ లా టైబ్ర్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో నకిలీ పత్రాలు, ఫోర్జరీ చెక్కులు, తప్పుడు క్లెయిమ్‌లు సమర్పించి తన రియల్ ఎస్టేట్ కంపెనీని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని బాచుపల్లికి చెందిన వ్యాపారవేత్త రాజ్‌కుమార్ రాయ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్ అనన్య ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్‌గా 2013 నుంచి నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపార అవసరాల కోసం విజయ్ వర్గీయ అనే ఓ కుటుంబం నుంచి అప్పులు తీసుకున్నారు. తర్వాతి కాలంలో ఆ కుటుంబానికి చెందిన నితేశ్, ముఖేష్ తదితరులు అనన్య ఇన్‌ఫ్రా లావాదేవీల్లో కీలకంగా మారారు. 2020లో వ్యాపార సంక్షోభం, కరోనా, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రాజ్‌కుమార్ సంస్థ కార్యకలాపాలకు దూరమయ్యారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని నితేష్, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్ స్వామి తదితరులు కుట్రపూరితంగా అనన్య ఇన్‌ఫ్రా సంస్థను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకోసం రాణిగంజ్‌కు చెందిన కృష్ణ స్టీల్స్ యజమాని కృష్ణ అగర్వాల్ పేరుతో ఎన్‌సీఎల్‌టీలో తప్పుడు కేసు దాఖలు చేశారు. నకిలీ పత్రాలు చూపించి నిందితులు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్(సీఓసీ)లో సభ్యులయ్యారని, దివాలా ప్రక్రియను దుర్వినియోగం చేసి సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని రాజ్‌కుమార్ ఆరోపించారు. దీంతో, తాను సంస్థపై నియంత్రణ కోల్పోయినట్లు తెలిపారు. మొత్తం రూ.200 కోట్లకు పైగా ఆర్థిక నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.