Share News

సంస్థాగత నిర్మాణంపై నజర్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:49 AM

కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు కమిటీలపై దృష్టి సారించింది. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) నియామక ప్రక్రియను వేగవంతం

సంస్థాగత నిర్మాణంపై నజర్‌

జగిత్యాల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు కమిటీలపై దృష్టి సారించింది. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు పీసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ పోలింగ్‌బూత్‌కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీపీసీసీ కోఆర్డినేటర్లను నియమించింది. క్షేత్ర స్థాయిలో క్యాడర్‌ను మరింత క్రియాశీలం చేయడంపై దృష్టి సారించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పార్టీ కేడర్‌ ప్రజల్లోకి వెళ్లేలా బూత్‌ స్థాయి కమిటీలను నియమిస్తోంది. ఇందుకోసం ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు కో ఆర్డినేటర్లుగా నియమించారు. జిల్లాలో ఉన్న పలువురు సీనియర్లను ఇతర జిల్లాల ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఫకీలకంగా బీఎల్‌ఏలు..

రాబోయే ఎన్నికల్లో బూత్‌ లెవల్‌ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్‌కు 10 నుంచి 15 మంది యాక్టివ్‌ టీంతో బూత్‌ లెవల్‌ ఏజెంట్లను ఎంపిక చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఎంపికైన బీఎల్‌ఏలు ఓటరు లిస్ట్‌ పరిశీలన, డోర్‌ టు డోర్‌ ప్రచారం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రతీ బూత్‌ను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్‌ కార్యకర్తలను ఎంపిక చేసి ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటరు జాబితాలో లోపాల గుర్తింపు, సరిద్దే పనులను అప్పగించనున్నారు.

ఫబూత్‌ గెలిస్తేనే సీటు గెలుస్తాం..

బూత్‌ గెలిస్తేనే సీటు గెలుస్తాం అనే నినాదంతో ముందుకెళ్లాలన్న అధిష్ఠానం సూచనల మేరకు అసెంబ్లీ టీపీసీసీ కోఆర్డినేటర్లు కేడర్‌కు మార్గనిర్దేశనం చేయనున్నారు. బీఎల్‌ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్‌కు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బూత్‌ లెవల్‌ ఏజెంట్ల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా క్షేత్రస్థాయిలో కమిటీలన్నింటినీ పటిష్ట పరచడం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నేతలు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళిక రూపొందిస్తున్నారు. లోక్‌సభతో పాటు శాసనసభ నియోజకవర్గ స్థానాల పెంపునకు ఆమోదం లభించే అవకాశమున్న దృష్ట్యా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను మెరుగుపరిచేందుకు టీపీసీసీ కో ఆర్డినేటర్లను నియమించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఫజిల్లాలో 930 పోలింగ్‌ కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా 930 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో 262 పోలింగ్‌ స్టేషన్లు, జగిత్యాలలో 254 కేంద్రాలు, ధర్మపురిలో 216 కేంద్రాలు, కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గం పరిదిలోని కొడిమ్యాల, మల్యాల మండలాల్లో 108 కేంద్రాలు, సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిదిలోని కథలాపూర్‌, మేడిపల్లి, భీమారం మండలాల్లో 90 కేంద్రాలు ఉన్నాయి.

ఫటీపీసీసీ కో ఆర్డినేటర్లు వీరే..

జిల్లాలోని నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి తిప్పిరెడ్డి మానాల మోహన్‌ రెడ్డి, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ ఎండీ రియాజ్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్‌కు రహమాత్‌ హుస్సేన్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్‌లో గల మల్యాల, కొడిమ్యాల మండలాలకు గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్‌, బీమారం మండలాలకు మహ్మద్‌ ఖాజా ఫకీరోద్దిన్‌లను నియమించారు. అదేవిదంగా జిల్లాలోని మెట్‌పల్లి పట్టణానికి చెందిన సీనియర్‌ నేత ఎండీ అవేజ్‌ను మహబూబాబాద్‌, డోర్నకల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల టీపీసీసీ కో ఆర్డినేటర్‌గా నియామకం చేశారు.

పార్టీ మార్గదర్శకాల మేరకే...

-గాజెంగి నందయ్య, డీసీసీ అధ్యక్షుడు

కాంగ్రెస్‌ అధిష్ఠానం మార్గదర్శకాల మేరకు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ది, సంక్షేమం సాధ్యమవుతుంది.

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా

-ఎండీ అవేజ్‌, టీపీసీసీ కో ఆర్డినేటర్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌ అసెంబ్లీ సెగ్మెంట్లు

రాష్ట్రంలో బూత్‌ లెవల్‌లో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ నేతృత్వంలో కసరత్తు జరుగుతోంది. మహబూబాబాద్‌, డోర్నకల్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల టీపీసీసీ కో ఆర్డినేటర్‌గా అవకాశం కల్పించడం సంతోషకరం. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా. ప్రస్తుతం బూత్‌ లెవల్‌ ఏజెంట్ల నియామకం కోసం టీపీసీసీ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తా.

Updated Date - Apr 09 , 2026 | 12:49 AM