స్టాంప్ డ్యూటీ మళ్లింపుపై నజర్
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:36 AM
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో స్టాంప్‌డ్యూటీ సొ మ్ము చెల్లింపులపై జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది. సొమ్ము స్వాహా చేసిన అంశాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.
సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు
జిల్లాలో 1,342 రిజిస్ట్రేషన్లలో వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించిన అధికారులు
సుమారు రూ.5కోట్ల మేరకు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లో నగదు
సీసీఎల్‌ఏ వివరాల ఆధారంగా విచారణ
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో స్టాంప్‌డ్యూటీ సొ మ్ము చెల్లింపులపై జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది. సొమ్ము స్వాహా చేసిన అంశాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఏ మండలాల్లో ఎంత మేరకు భూముల రిజిస్ట్రేషన్లలో వ్యత్యాసం ఉందో, ఆ వివరాలను సీసీఎల్‌ఏ కలెక్టర్లకు అందజేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, మీ-సేవా కేంద్రాల నిర్వాహకులతో కలెక్టర్ ఎం.హనుమంతరావు సమావేశమయ్యారు.
స్టాంప్‌డ్యూటీ సొమ్ము మళ్లింపు వ్యవహారాన్ని తేల్చేందుకు ధరణి పోర్టల్ నుంచి భూభారతి వరకు జరిగిన లావాదేవీల్లో వ్యత్యాసాలపై రెవె న్యూ యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. జిల్లా లో మొత్తం 1,342 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీ చార్జీల్లో వ్యత్యా సం ఉన్నట్టుగా గుర్తించారు. ఏ గ్రామా ల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయి? మీ-సేవా కేంద్రాల్లో జనరేట్ అయినా చలానా, తహసీల్దార్ లాగిన్‌లో నమోదైన వివరాలతో పాటు చలానాల్లో ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలించి, ఎవరు బాధ్యులో వారిపై కేసులు నమోదుచేయాలని, ప్రభుత్వ ఖజానాకు చేరకుండా ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లో చేరిన డబ్బును రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే జిల్లాలో రాజపేట మండలంలో అత్యధికంగా సుమారు 672 రిజిస్ట్రేషన్లకు చెందిన స్టాంప్‌డ్యూటీలో వ్యత్యాసం ఉందని, మోటకొండూరు, వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్, తదితర మండలాల్లో లావాదేవీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. అధికారుల విచారణలో గుర్తించిన లావాదేవీల ప్రకారం ప్రస్తుతానికి రూ.5కోట్లమేర వ్యత్యాసం తేలింది. తహసీల్దార్లు అన్ని డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, చలానాలను బట్టి లెక్కలు వేసే పనిలో నిమగ్నమయ్యారు.ప్రభుత్వఆదేశాల మేరకు వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విచారణ అధికారులుగా ఆర్డీవోలు
భూముల రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన మొత్తాన్ని దారిమళ్లించడంపై కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు రికవరీ, క్రిమినల్ కేసులు, పీడీ యాక్ట్ నయోదు చేయనున్నుట్టు ఆయన తెలిపారు. డాక్యుమెంట్లు అన్నింటిని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అంశంపై భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్‌రెడ్డిని విచారణ అధికారులుగా నియమించినట్టు ఆయన తెలిపారు.
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై ఆరా..
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల లో స్టాంప్ డ్యూటీ ఎగవేత అంశంపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది. సాధారణంగా రైతు లు మీ-సేవా కేంద్రాల్లో భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చలానాలు తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. భూముల విలువ ప్రకారం రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీలు ఉండాలి. ఈ-చలానాలో విచారణ చేసే అధికారం తహసీల్దార్‌కు లేకపోయినప్పటికీ భూ ముల విలువను బట్టి రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే దీన్ని గమనించకుండా మీ-సేవా కేం ద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే, ఎలాంటి విచారణ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారా? అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం విచారణ నిర్వహిస్తోంది.
అరెస్టులు, విచారణ ప్రారంభం
స్టాంప్ డ్యూటీ సొమ్మును కాజేసిన ఘటనపై పోలీసులు, రెవెన్యూ యం త్రాంగం విచారణ ప్రారంభించిం ది. జిల్లాలోని పలు మీ-సేవా కేంద్రాల్లో లావాదేవీలు చేసిన వారిని అరెస్టు చేసి, జనగామలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో అనుమానం ఉన్న వారిని విచారిస్తున్నారు. ఇప్పటికే రాజపేట మండలానికి చెందిన పలువురిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు మండలాల వారీగా ఏ గ్రామాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయనే పూర్తి వివరాలను సేకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. సీసీఎల్‌ఏ నుంచి కలెక్టర్‌కు అందిన జాబితా ప్రకారం పరిశీలన చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్‌ను ఆసరా చేసుకుని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ రుసుమును తక్కువ చూపి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ప్రధానంగా మీ-సేవా కేంద్రాల తరహాలో సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎ్‌ససీ)లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఐదేళ్లుగా జరుగుతున్న అవకతవకలపై పూర్తి విచారణ చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తున్న స్టాంప్ డ్యూటీ, చలానాల సొమ్మును మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు పక్కదారి పట్టించడంలో అసలు లోపం భూభారతి పోర్టల్‌లోనే ఉందని అధికారులు గుర్తించారు. పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరా చేసుకుని అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసుకున్నట్టుగా గుర్తించారు. అయితే తహసీల్దార్ లాగిన్‌లో వచ్చిన ఆధారాలను సరి చూసుకున్నారా? లేదా అనే అంశం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.
‘మీసేవా’ నిర్వాహకుడి అరెస్టు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట పట్టణంలో భూభారతి ఫోర్టర్ ఎడిట్ ఆప్షన్‌తో ప్రభుత్వ ఖాజానాకు గండికొట్టిన మ రో మీసేవ నిర్వాహకుడిని ఆదివారం రాత్రి సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే గుట్టలో ఇద్దరు మీసేవవా నిర్వాహకులను అరెస్టు చేశారు.