అసెంబ్లీలో వందేమాతరం.. మజ్లిస్ బాయ్‌కాట్!
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:12 AM
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం శాసనసభలో జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలాపనను ఎంఐఎం సభ్యులు బాయ్‌కాట్ చేయడం వివాదానికి దారితీసింది.
జాతీయ గేయాన్ని ఆలపిస్తుండగా సభ్యుల వాకౌట్
ఎంఐఎం తీరును తీవ్రంగా తప్పుబట్టిన బీజేపీ
అత్యంత హేయమైన చర్య: రాంచందర్‌రావు
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం శాసనసభలో జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలాపనను ఎంఐఎం సభ్యులు బాయ్‌కాట్ చేయడం వివాదానికి దారితీసింది. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం గేయాన్ని విధిగా ఆలపించాలంటూ కేంద్రం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో శాసనసభలో ఈ గేయాన్ని ఆలపించారు. సోమవారం ఉదయం ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కాగానే.. సభలో తొలుత తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను, అనంతరం ‘వందేమాతరం’ను ఆలపించారు. అయితే వందేమాతరం గేయాలాపన సమయంలో మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మౌనంగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫెందీ మాత్రమే సభలో ఉన్నారు. మరో ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్.. వందేమాతరం ఆలాపన జరుగుతుండగా కుర్చీలోనే కూర్చున్నారు. దీంతో పక్కనే ఉన్న బీజేపీ సభ్యుడొకరు.. లేచి నిల్చోవాలని సైగ చేశారు. అయితే రహ్మత్‌బేగ్ లేచి బయటకు వెళ్లిపోయారు. మజ్లిస్ సభ్యులంతా తిరిగి జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపన జరుగుతున్న సమయంలో సభ లోపలికి వచ్చారు. కాగా, వందేమాతరం ఆలాపన జరుగుతుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. ఈ చర్య.. దేశం పట్ల వారికున్న గౌరవంపై ప్రశ్నలను లేవనెత్తుతోందని ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు. ‘‘అసలు వీరి విధేయత ఎవరి పట్ల ఉంది? పార్లమెంటు సాక్షిగా వారి నాయకుడు జై పాలస్తీనా అని నినాదాలు చేసిన తీరును దేశ ప్రజలు ఎలా విస్మరిస్తారు?’’ అని వ్యాఖ్యానించారు. కాగా మజ్లిస్ ఎమ్మెల్యేల వైఖరి సిగ్గుచేటు అని, ఈ చర్య భరతమాత ఆత్మకు, జాతీయ గేయానికి జరిగిన అవమానమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.