‘జాతీయ విద్యుత్ పాలసీ-2026 ’
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:59 AM
టెలికాం రంగంలో మాదిరిగానే ఒక ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువ డిస్కమ్‌లు కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతినివ్వాలనే జాతీయ విద్యుత్ పాలసీ-2026 ముసాయిదాపై అభ్యంతరాలు...
ఒకే ప్రాంతంలో బహుళ డిస్కమ్‌లు.. ప్రైవేటుకు పెద్దపీట!
ఉచిత విద్యుత్‌పై కేంద్రం కీలక ప్రతిపాదనలు
అభ్యంతరాలకు మరో నెలరోజుల గడువు
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): టెలికాం రంగంలో మాదిరిగానే ఒక ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువ డిస్కమ్‌లు కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతినివ్వాలనే జాతీయ విద్యుత్ పాలసీ-2026 ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు గడువును మరో నెలరోజులు (మార్చి 19) పొడిగిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముసాయిదా ప్రకారం డిస్కమ్‌ల గుత్తాధిపత్యం రద్దయ్యి.. వినియోగదారులు తమకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్ పొందే అవకాశం కలుగుతుంది. విద్యుత్ పంపిణీ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఈ కొత్త పాలసీని సిద్ధం చేసింది.
ముసాయిదాలోని కొన్ని ముఖ్యాంశాలు
రాష్ట్రాలు ఉచిత విద్యుత్ అందించాలనుకుంటే, ఆ సబ్సిడీ మొత్తాన్ని ముందుగానే డిస్కమ్‌ల ఖాతాల్లో జమచేయాలి. విద్యుత్ కొనుగోళ్లకు అయ్యే అధిక వ్యయాన్ని ఏ నెలకానెల వినియోగదారుల నుంచే రాబట్టుకోవాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు విధిగా ప్రీపెయిడ్/స్మార్ట్ మీటర్లను బిగించాలి. బిల్లుల సమాచారాన్ని వినియోగదారుల ఫోన్లకే పంపాలి. 2047నాటికి దేశం మొత్తం విద్యుతుత్పత్తిలో రెండో వంతు సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా ఉండాలి. ఉచిత కరెంట్ అందుతున్న వ్యవసాయ పంపుసెట్లను సోలార్ పంపుసెట్లుగా మార్చాలి. ఒక మెగావాట్ కంటే ఎక్కువ విద్యుత్ వాడే వినియోగదారులకు నేరుగా విద్యుత్‌ను కొనుగోలు చేసే ‘ఓపెన్‌యాక్సె్‌స’ సౌకర్యాన్ని కల్పించి, వీరిపై భారంగా ఉన్న అదనపు సర్ ఛార్జీలను క్రమంగా తగ్గించాలి.