kumaram bheem asifabad- మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి
ABN , Publish Date - Apr 07 , 2026 | 10:52 PM
మహిళల సంక్షేమం, అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యపడుతుందని కలెక్టర్ కె హరిత అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జిల్లా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ జన్మోత్సవ్ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు
ఆసిఫాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): మహిళల సంక్షేమం, అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యపడుతుందని కలెక్టర్ కె హరిత అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జిల్లా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ జన్మోత్సవ్ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమం ద్వారా ఆడ పిల్లలను కాపాడుకుందాం, చదివించుకుందాం, ఎదగనిద్దాం నినాదంతో ఆడ పిల్లల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. లింగ వివక్ష లేకుండా పురుషులతో సమానంగా మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు అనేక పథకాల ద్వారా ఆర్థిక చేయూతనందిస్తుందన్నారు. అనంతరం బేటీ జన్మోత్సవ్ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు కావాల్సిన 12 రకాల వస్తువులతో కూడిన పది బేబీ కిట్లను అందజేశారు. అంగన్‌వాడీ టీచర్లకు విధుల నిమిత్తం 871 4జీ మొబైల్ పోన్లు అందజేశారు. కార్యక్రమంలో సీఈఓ, ఏసీడీపీఓలు, సూపర్‌వైజర్‌లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబోద్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె, పట్టణ దవాఖానాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజా సంక్షేమం కోసం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలో చేపట్టిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సెప్టెంబరు నెలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 14 నుంచి 15 సంవత్సరం వయస్సు గల పిల్లలకు హెచ్‌పీవీ టీకా అందిస్తున్నామని అన్నారు. నవజాత శిశు నుంచి పిల్లలకు సకాలంలో టీకా అందించి వారి ఆరోగ్యం మెరుగు పడేలా చూస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది గ్రామస్థాయిలో సేవలు అందించాలని తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు.